అంతా ఆయన వల్లే..జగన్‌పై మర్రి బాణాలు..!

వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అనుకున్నంత పనిచేశారు. ఆరు నెలల ఉత్కంఠకు తెరదించి ఎట్టకేలకు వైసీపీకి గుడ్‌బై చెప్పి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.;

Update: 2025-03-20 16:12 GMT

వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అనుకున్నంత పనిచేశారు. ఆరు నెలల ఉత్కంఠకు తెరదించి ఎట్టకేలకు వైసీపీకి గుడ్‌బై చెప్పి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్..మండలి ఛైర్మన్‌కు రిజైన్‌ లెటర్ ఇచ్చేశారు. బొత్స సత్యనారాయణ వంటి నేతలను ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వినలేదు. ఆరు నెలలుగా ఆయన అసంతృప్తిపై వార్తలు చక్కర్లు కొడుతున్నా..మర్రి రాజశేఖర్‌ పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్న ఇప్పటివరకు ఆయనతో వైసీపీ పెద్దలు ఎవరూ మాట్లాడలేదని తెలుస్తోంది. రాజీనామా చేయాలని డిసైడ్‌ అయ్యాక.. సినిమాలో క్లైమాక్స్ రేంజ్‌లో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలతో మర్రి రాజశేఖర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వైసీపీలో ఉండేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరాలని కూడా మర్రి రాజశేఖర్‌ డిసైడ్ అయ్యారు.

బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఇంట్రెస్టింగ్‌ సీన్స్ కనిపించాయి. మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అలర్ట్ అయ్యారు. మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా జగన్ పార్టీ నేతలను రంగంలోకి దించారు. జగన్ ఆదేశాలతో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లాబీల్లోనే ఆపేశారు. జగన్‌తో మాట్లాడాలంటూ సూచించగా..రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని అందులో మార్పు ఉండబోదని చెప్పి మర్రి అక్కడి నుంచి వెళ్లిపోయారట.

ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్భంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను వైసీపీని వీడటానికి జగనే కారణమని చెప్పారు. తనకు ఇచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని..అందుకే తనను కాదని విడదల రజినికి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయానని అన్నారు. అయితే రజినికి మంత్రి పదవి ఇచ్చిన జగన్ తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు.

2024లో అయినా తనకు న్యాయం జరుగుతుందని అనుకుంటే..గుంటూరు మేయర్‌ను తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిలిపారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అటు గుంటూరు వెస్ట్, చిలకలూరిపేటల్లో రెండు చోట్లా పార్టీ ఓడినా..మళ్లీ రజినిని చిలకలూరిపేట ఇంచార్జ్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో ఇక తనకు వైసీపీలో న్యాయం జరిగే పరిస్థితి లేదని అర్థమైందని.. అందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కూడా ఆయన ఆరోపించారు. మొత్తంగా జగన్ కారణంగానే తాను వైసీపీని వీడానని మర్రి తేల్చి పారేశారు.

నిజానికి చిలకలూరిపేట ఇంచార్జ్‌గా విడదల రజినిని నియమించినప్పటి నుంచి..మర్రి రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రజిని మళ్లీ చిలకలూరిపేటలో అడుగు పెడితే... పార్టీకి కూడా దూరంగా ఉంటానంటూ..సన్నిహితుల దగ్గర మర్రి చెప్పుకున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయ్. దీంతో వైవీ సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు గతంలోనే బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. రాజీనామా చేసే ముందు కూడా మర్రి రాజశేఖర్‌కు వైసీపీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనా సరే పార్టీకి, పదవికి బైబై చెప్తూ మర్రి నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్‌..జగన్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మర్రి పోటీకి రెడీ అవగా..విడదల రజినికి జగన్ సీటు కేటాయించారు. అయితే ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ బహిరంగసభలోనే ప్రకటించారు. ఆ హామీ కూడా నెరవేరలేదు. 2023లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మంత్రి పదవి మాత్రం రాలేదు. 2024 ఎన్నికల్లో చిలకలూరి పేట ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ఆశపడ్డారు మర్రి రాజశేఖర్. విడదల రజినిని గుంటూరు వెస్ట్‌కు పంపించినా..చిలకలూరి పేట టికెట్ మర్రి రాజశేఖర్‌కు కాకుండా మరో నేతకు ఇచ్చారు జగన్. అటు గుంటూరు వెస్ట్‌లో రజిని, చిలకలూరిపేటలో వైసీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ఘోరంగా ఓడిపోయారు. ఐతే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ చిలకలూరిపేట ఇంచార్జ్‌గా రజినికి బాధ్యతలు అప్పగించారు. దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతోపాటు పార్టీని వీడాలని మద్దతుదారుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో..ఇప్పుడు మర్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మర్రి రాజశేఖర్‌కు ముందు..వైసీసీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామాలు చేశారు. వైసీపీని వీడిన ఐదో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌. ఈ ఐదుగురి రాజీనామాలు శాసనమండలి ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయ్. మరి ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా..ఇలానే సాగుతుందా అనేది చూడాలి మరి.

Tags:    

Similar News