అసెంబ్లీకి హాజరు.. మాట తప్పిన జగన్

అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో నిరవధిక వాయిదా పడ్డాయి. దాదాపు 15 రోజుల పాటు 84 గంటల పాటు అసెంబ్లీలో వివిధ అంశాలపై చర్చ జరిగింది.;

Update: 2025-03-21 05:04 GMT
Jagan in Assembly

మాట తప్పను.. మడమ తిప్పను అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్ స్లోగన్.. 2019 ఎన్నికలకు ముందు ఈ నినాదమే వైసీపీకి ఊపు తెచ్చింది. ఘన విజయం తెచ్చిపెట్టింది. ఐదేళ్ల పాలనలోనూ అదే మాట పదే పదే చెప్పేవారు జగన్.. కట్ చేస్తే, ఇప్పుడు ఆ మాట వినిపించడం లేదు సరికదా.. ఆయన చెప్పిన మాట కూడా తప్పుతున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేకాని అసెంబ్లీకి రానంటూ గిరిగీసుకున్న వైసీపీ అధినేత.. అసెంబ్లీ జరుగుతుండగా, రోజూ మీడియాతో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించారు. ఏదైనా సరే మాజీ సీఎం అలా ప్రశ్నిస్తే ఎంతో కొంత ప్రభుత్వంపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రతిపక్షం నుంచి సమస్యలు లేవనెత్తితే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.

అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో నిరవధిక వాయిదా పడ్డాయి. దాదాపు 15 రోజుల పాటు 84 గంటల పాటు అసెంబ్లీలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. అటు మండలిలోనూ దాదాపు అదే సమయం అధికార, విపక్షాల మధ్య సమరం నడిచింది. అయితే ప్రతిపక్షం లేకపోవడం వల్ల అసెంబ్లీ ఏకపక్షంగానే సాగింది. అప్పుడప్పుడు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇకపోతే సభకు రాకపోయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పిన జగన్ ఈ 15 రోజుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే మాట్లాడారు. దీంతో జగన్ తనకు తానుగా ఇచ్చిన తప్పారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం.. ఆ పని ఎలాగూ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష హోదా దక్కదని తెలిసి కూడా అదే విషయం కోసం పట్టుబడి సభకు డుమ్మా కొట్టడం వల్ల తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే పార్టీలోనూ అంతర్గత చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అయినా అధినేత మీడియా ముందుకు వస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జగన్ ఏమకున్నారో కానీ, తాను చెప్పిన మాటను తానే పట్టించుకోకపోవడంతో ప్రభుత్వందే పైచేయిగా భావించాల్సివస్తోందని అంటున్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే హామీలు నెరవేర్చడం లేదని చెప్పిన వైసీపీ.. కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వమిచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా ఒత్తిడి చేసే అవకాశాన్ని చేజేతులా వదులుకుందని అంటున్నారు. కనీసం జగన్ మీడియా ఎదుటకు వచ్చి సూపర్ సిక్స్ హామీలపై సభ జరిగిన రోజుల్లో మీడియాలో మాట్లాడితే ప్రజల్లో చర్చ జరిగేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టగా, 15 రోజులపాటు దానిపై చర్చ జరిగింది. రోజుకో శాఖపైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రభుత్వం చెప్పినది మాత్రమే ప్రజలు తెలుసుకోవాల్సివచ్చింది. అదే ప్రతిపక్షం ఉంటే అందులో లోతుపాతులు, కష్ట, నష్టాలు ప్రజలకు తెలియజేసే అవకాశం ఉండేదని అంటున్నారు. సభకు వెళ్లని వైసీపీ ఆ అవకాశాన్ని కోల్పోగా, జగన్ కూడా ఆ పనిచేయకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు తాను సభకు వెళ్లనని, తనతోపాటు మిగిలిన 10 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీ గుమ్మం తొక్కరని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేస్తున్నారని సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించి గాలి తీసేశారంటున్నారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సంతకాలు చేశారనే చర్చ కూడా ఎక్కువగా జరుగుతోంది. అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వాలు రద్దు అవుతాయన్న భయమే వారిని దొంగచాటుగా సంతకాలు చేసేలా పురిగొల్పిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో కూడా జగన్ తన శాసనసభ్యులను అదుపు చేయలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలోనూ వైసీపీ అధినేత జగన్ మాట తప్పినట్లు భావించాలని అంటున్నారు.

Tags:    

Similar News