ఏపీకి జగన్ 'భారతీ' సిమెంట్స్ పరిశ్రమ వస్తే... మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఇదే సమయంలో... గత ప్రభుత్వం రాజధాని అమరావతిని విధ్వంసం చేయడంతోపాటు సాఫ్ట్ వేర్, అండర్ వేర్ కంపెనీలనూ వదల్లేదని ఫైర్ అయ్యారు.;

ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాకపై శాసన మండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ విషయాన్ని పయ్యావుల నొక్కి చెప్పారు. జగన్ ఒక్క ఫోన్ కాల్ తో అంత చేశారని విమర్శించారు.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సరైన పరిశ్రమలు రాలేదని.. కాగితాలపై కనిపిస్తున్న అంశాలు, రియాలిటీలో దర్శనమివ్వడం లేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోన్న వేళ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమరరాజ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారని మండిపడ్డారు.
ఇదే సమయంలో... గత ప్రభుత్వం రాజధాని అమరావతిని విధ్వంసం చేయడంతోపాటు సాఫ్ట్ వేర్, అండర్ వేర్ కంపెనీలనూ వదల్లేదని ఫైర్ అయ్యారు. అయితే... ఒడిశాతో చర్చలు జరుపుతోన్న అర్సెలార్ మిత్తల్ కంపెనీని కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి రప్పించిందని.. ఫలితంగా రూ.1.70 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుందని తెలిపారు.
ఈ సందర్భంగా... ఏపీలో పెట్టుబడులు పెడతామని ఏ కంపెనీ ముందుకు వచ్చినా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తామని చెప్పిన పయ్యావుల కేశవ్... ఆఖరికి వైఎస్ జగన్.. మరో భారతీ సిమెంట్ పరిశ్రమను ఏపీలో పెడతామని వచ్చినా సహకరిస్తామని.. ఇది కూటమి ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికీ ఉన్న తేడా అని.. రాష్ట్రానికి కంపెనీలు రావాలని, యువతకు ఉపాధి దొరకాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
ఇక ప్రశ్నోత్తరాల సమయంలో.. ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన మంత్రి... 3 రోజుల దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు 67 కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారని.. 28 రంగాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించారని.. అదే గత ప్రభుత్వ హయాంలో దావోస్ లో 11 రోజులు పర్యటించి 46 మందినే కలిశారని తెలిపారు.
ఈ సమయంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... తమ ప్రభుత్వంలో సరాసరిన ఏడాదికి 15 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. అధికారుల వద్ద అన్ని వివరాలు ఉన్నాయని.. అవసరమైతే దీనిపై సభ్యులతో జాయింట్ మీటింగ్ పెడతామని తెలిపారు. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిందాల్ పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలివెళ్లి మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టిందని విమర్శించారు.