కార్యకర్తల విషయంలో బాబు లోకేష్ సంచలన నిర్ణయం !

తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకి లేని బలం బలగం ఉన్నాయి. కార్యకర్తలు ఆ పార్టీకి శ్రీరామరక్ష. తెలుగుదేశం పార్టీకి వారే ఎపుడూ అండ.;

Update: 2025-03-20 16:14 GMT

తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకి లేని బలం బలగం ఉన్నాయి. కార్యకర్తలు ఆ పార్టీకి శ్రీరామరక్ష. తెలుగుదేశం పార్టీకి వారే ఎపుడూ అండ. టీడీపీ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులు పార్టీ మారారు. కానీ క్యాడర్ మాత్రం అలాగే పార్టీని అట్టిపెట్టుకొని ఉంది. అందుకే నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేయగలిగింది.

మరిన్ని ఎన్నికల్లో గెలవగలిగింది. తెలుగుదేశం పార్టీకి దేశంలో ఎక్కడా లేనంతమంది క్యాడర్ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలలో ఇది ఒక రికార్డు కోటికి పైగా సభ్యత్వంతో టీడీపీ ఈ రోజు ఉంది అంటే కార్యకర్తలు పసుపు జెండాని పట్టి గ్రామ స్థాయిలో దానిని రెపెరెపలాడించడమే అని చెప్పాల్సి ఉంది.

ఇదిలా ఉంటే పార్టీకి కష్టకాలం వస్తే కార్యకర్తలే నిలిచి ఉన్నారు. వారే ఉద్యమాలు చేశారు. పోరాటాలు చేశారు. వారే పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యలో తెలుగుదేశం పార్టీ అలుపులేని పోరాటాల వెనక క్యాడర్ బలంగా నిలిచి ఉందని అంటున్నారు.

ఈ సత్యాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీకి కార్యకర్త అధినేత అన్న కొత్త ఫిలాసఫీని తీసుకుని వస్తున్నారు. ఎంతటి ఉన్నత పదవులు పార్టీలో అనుభవిస్తున్నా ఎంతటి మహా నాయకులు అయినా పార్టీ క్యాడర్ కి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాల్సిందే అని వారు అంటున్నారు.

ఆ విధంగా పార్టీలోని ఎమ్మెల్యేలు ఇంచార్జిలు ఎప్పటికపుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ వారి ఆలోచనలను పంచుకుంటూ పార్టీలో ప్రభుత్వంలో వారికి పూర్తి విలువ ఇవ్వాలని వారు దిశా నిర్దేశం చేస్తున్నారు. వీలైనంత సేపు వారితోనే ఉండాలని ప్రతీ కార్యక్రమంలో వారిని కలుపుకుని పోవాలని నిర్దేశిస్తున్నారు.

ప్రతీ ఒక్క కార్యకర్తను కలసుకోవాలని వారి సమస్యలను పరిష్కరించాలని అధినాయకత్వం గట్టిగానే పార్టీ ఎమ్మెల్యేలను కోరుతోంది. ఇక మీదట ప్రతీ బుధవారం ఏపీలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ కార్యకర్తలతో మీటింగులు నిర్వహించాలని ఎమ్మెల్యేలు పార్టీ ఇంచార్జిలు ఆ మీటింగులో పాలు పంచుకోవాలని కోరుతున్నారు.

కార్యకర్తలను అంతా అండగా నిలబడాలని కూడా సూచిస్తున్నారు. ముందుగా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఈ తరహా సమావేశాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ప్రతీ పర్యటనకు ముందు కార్యకర్తలను కలుసుకుంటూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వస్తున్నారు.

అలా క్లస్టర్ యూనిట్ బూత్ యూనిట్ క్యాడర్ తో సమావేశాలు జరుపుతున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఫీల్డ్ వర్క్, శంఖారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదు అలా ప్రతీ దాంట్లో అద్భుతమైన పనితీరుని కనబరచిన కార్యకర్తలను ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు

అందువల్లనే కార్యకర్తలల్తో ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించాలని లోకేష్ కోరుతున్నారు. అంతే కాదు ప్రతీ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో సమావేశాలు పెట్టి వారి నుంచి వినతులు స్వీకరించాలని కూడా కోరుతున్నారు.

ఇలా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకం అవుతూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని సూచిస్తున్నారు. ఇక వీటికి సంబంధించిన మినిట్స్ ని పార్టీ ఆఫీసుకు ఎప్పటికపుడు పంపించాలని కూడా కోరారు. మొత్తానికి కార్యకర్తలతో టీడీపీ మరింత బలమైన బంధాన్ని పెనవేయడానికి సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇది నిజంగా భేష్ అనదగినదే. మిగిలిన పార్టీలు కూడా అనుసరించాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News