బాబు పవన్ ల మధ్య ఉన్న బంధం అదేనా ?
ఏపీలో టీడీపీ కూటమి గత పది నెలలుగా అధికారంలో కొనసాగుతోంది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు.;
ఏపీలో టీడీపీ కూటమి గత పది నెలలుగా అధికారంలో కొనసాగుతోంది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమిలో టీడీపీ పెద్దన్నగా ఉంటే జనసేన కీలక స్థానంలో ఉంది. బీజేపీ కేంద్ర స్థాయిలో ఉంటూ మార్గదర్శకత్వం చేస్తోంది. దాంతో ఈ కూటమి మరింత కాలం పదిలంగా ఉంటుందన్నది అందరిలో ఉంది.
ఎందుకు అంటే చంద్రబాబుకు ఈ పొత్తులు కొనసాగాలని ఉంది. పవన్ కళ్యాణ్ అయితే బాహాటంగా పదిహేనేళ్ల పాటు ఈ పొత్తులు కొనసాగుతాయని స్పష్టం చేస్తూనే ఉన్నారు. కేంద్రంలో మోడీ అమిత్ షా అయితే టీడీపీ జనసేనలతో బంధం ఇంకా చాలా కాలం కొనసాగాలని చూస్తున్నారు.
ఈ విధంగా చూస్తే కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య అధినాయకుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనే లేవు అని అంటున్నారు. అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న విషయాలను హైలెట్ చేస్తూ జనసేన టీడీపీల మధ్య ఏదో గ్యాప్ ఉందని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. జనసేన ఆవిర్భావ సభంలో పవన్ కళ్యాణ్ నాగబాబు అన్న మాటలను పట్టుకుని సోషల్ మీడియాలో ఒక రేంజిలో డైలాగ్ వార్ సాగుతూ వచ్చింది.
దాంతో ఇంకేముంది కూటమి విచ్చిన్నం అవుతుందని జనసేన టీడీపీ వేరుపడతాయని అంతా అనుకునే సీన్ ఉంది. కానీ అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు పవన్ మధ్య ఉన్న బంధం తెలియచేస్తోంది అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఇద్దరు నేతలు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ప్రభుత్వం సాధించిన విజయాల వెనక బాబు ఉన్నారని పవన్ చెబుతూనే ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణకు రూపకర్త బాబు అని నిండు సభలో ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ ని ఎపుడూ పవన్ మెచ్చుకుంటూనే ఉన్నారు. ఇక చంద్రబాబు సైతం అసెంబ్లీలో అరకు టీ షాప్ ప్రారంభం వేళ స్వయంగా కాఫీని తెచ్చి అందించడం కూడా విశేషంగా చూడాలి.
దీనిని చూసిన వారు అంతా బయట ప్రచారం తప్పించి చంద్రబాబు పవన్ ల మధ్య ఎలాంటి గ్యాప్ అయితే లేనే లేదని అంటున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే చిన్న చిన్న వాటిని పెద్దవి చేసుకుంటూ కూటమిని ఇబ్బందుల పాలు చేసుకునే తత్వం బాబుకు పవన్ కి అసలు లేదని అంటున్నారు.
పైగా పది కాలాల పాటు ఈ బంధం కొనసాగాలని వారు మనసారా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చాలా పరిపక్వతతో పార్టీలు ఉన్న సందర్భంగా కూటమి కి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. ఇక చంద్రబాబు విషయం చూస్తే 2018లో ఒకసారి ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. అప్పటి పరిస్థితులను ఆయన చూశారు. 2019 ఎన్నికల్లో నష్టం కూడా చూశారు.
అందువల్ల ఆయన మరోసారి అలాంటివి చేయరని అంటున్నారు. ఇక బీజేపీ టీడీపీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా సర్దుబాటు చేసేందుకు పవన్ కచ్చితంగా ఉంటారని ఆయన కూటమి విషయంలో చేసేందుకు ఎంతదాకా అయినా సిద్ధపడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ కూటమి నిరాటంకంగా కొనసాగేదే తప్ప మధ్యలో ఆగేది కాదని అంటున్నారు.