వైరల్... రఘురామ, దుర్గేష్ ల యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం కాస్త ఆటవిడుపులో ఉన్న సంగతి తెలిసిందే.;
ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం కాస్త ఆటవిడుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నిత్యం సీరియస్ పాలిటిక్స్ లోనూ, ప్రజాసేవలోనూ బిజీగా ఉండే నేతలు రెండు రోజులు క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటగా.. తాజాగా తమలోని కళాకారుల కోణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అద్భుతాలు తెరపైకి వచ్చాయి!
అవును... విజయవాడ నగరంలోని 'ఏ' కన్వెషన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (ట్రిపుల్ ఆర్) దుర్యోధనుడి వేషధారణలో నటించారు.. అదరగొట్టారు.
ఇందులో భాగంగా... దుర్నోధనుడి వేషధారణలో దర్శనమిచ్చిన రఘురామ కృష్ణంరాజు... "ఏమంటివి.. ఏమంటివి..?" అంటూ దానవీరశూర కర్ణ సినిమాలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పాత్రను ఏకపాత్రాభినయం చేశారు. ఈ సమయంలో ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఈలలు, చప్పట్లు ఆగకుండా మోగాయి!
రఘురామ కృష్ణంరాజు చెప్పిన డైలాగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేష్ లు తమ తమ స్థానాల్లో నిల్చొని చప్పట్లతో అభినందించారఅంటే.. ట్రిపుల్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ దృశ్యం కనులపండుగా సాక్షాత్కరించింది!
ఇదే సమయంలో... జనసేన ఎమ్మెల్యే, ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్.. పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో అదరగొట్టారు. వేషధారణతో పాటు అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి దుర్గేష్ ప్రదర్శనకు సభ్యుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే, ఎచ్చెర్ల ఎమ్మెల్యేల హాస్య నటన ఆకట్టుకుంది.
ఇందులో భాగంగా... యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులు పాటలతో హాస్యం పండించారు. వీరి హాస్య నటనకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ తదితరులు కడుపుబ్బా నవ్వుకోవడం కనిపించింది. దీనికీ సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.