వివేకా హత్య కేసు: పట్టువదలని వైఎస్ సునీత

ఎలాగైనా సరే.. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసును ఛేదించాలని కృతనిశ్చయంతో పోరాడుతోంది ఆయన కుమార్తె సునీత.;

Update: 2025-03-21 13:55 GMT

ఎలాగైనా సరే.. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసును ఛేదించాలని కృతనిశ్చయంతో పోరాడుతోంది ఆయన కుమార్తె సునీత. ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టి.. ఇంటా బయటా కూడా కేసు విషయంలో యాక్టివ్ గా ముందుకెళుతోంది. కేసుకు సంబంధించిన ప్రతీ పరిణామాన్ని మీడియా ముందుకొచ్చి ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా హైకోర్టుకెక్కి మరో సంచలనానికి తెరతీసింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2019 మార్చి 14న జరిగిన ఈ హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని ఆరేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న సునీత, గతంలో సుప్రీం కోర్టు, సీబీఐ కోర్టుల తలుపులు తట్టారు. ప్రస్తుతం సీబీఐ కోర్టులో కొనసాగుతున్న ఈ కేసు విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టు తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారించింది.

హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా, దాదాపు నాలుగేళ్లుగా విచారణ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదని సునీత తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే రెండు ఛార్జిషీట్‌లు దాఖలు చేశారని ఆమె తెలిపారు. దాదాపు 15 నెలలుగా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌లో సునీత, సీబీఐ అధికారులతో పాటు తన తండ్రి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు.

ఈ అంశంపై విచారణ జరిపిన ప్రత్యేక ధర్మాసనం సీబీఐతో పాటు కేసులోని నిందితులందరికీ నోటీసులు జారీ చేసేందుకు సునీత తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్ సునీత ఈ కేసులో పోరాడుతుండడం గమనార్హం.

Tags:    

Similar News