విశాఖ ఉక్కుపై విడతల వారీ 'ఊగిసలాట'!
ఇది రాజకీయంగానే కాకుండా.. ఉద్యోగుల పరంగా కూడా.. తీవ్ర వివాదానికి దారి తీసింది.;
ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు విడతల వారీగా చెబుతున్న సమాధానాలు.. ఇస్తున్న లీకులు.. అనేక సందేహాలను అలానే పెంచి పోషిస్తున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పేర్కొనే.. విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం 2021లో తొలిసారి కుదుపునకు గురైంది. దీనిలో ప్రభుత్వానికి ఉన్న వాటాలను.. అమ్మేస్తున్నామని పార్లమెంటులో ప్రకటించారు. ఇది రాజకీయంగానే కాకుండా.. ఉద్యోగుల పరంగా కూడా.. తీవ్ర వివాదానికి దారి తీసింది.
కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలోని పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ... విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పూర్తిస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని సూచించిందని ఆనాడు కేంద్ర ఆర్థిక మంత్రి గా ఉన్న నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే.. దీనిని ప్రైవేటీకరించవద్దంటూ.. అప్పటి సీఎం జగన్.. లేఖలు సంధించారు. ఇక, ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. నిరసనలు, ధర్నాల పేరుతో కొంత ఉద్యమం కూడా సాగింది.
ఇక, అప్పట్లోనే కేంద్రం.. దీనిని ప్రైవేటీకరించి తీరుతామని చెప్పింది. నష్టాలు-కష్టాలు భరించలేని స్థాయి లో ఉన్నాయని స్పష్టం చేసింది. సొంతగా బొగ్గు గనులు కేటాయించని కారణంగానే విశాఖ ఉక్కు ఇబ్బం దుల్లో ఉందన్న కార్మికుల ఆవేదన కొనసాగింది తప్ప.. ఎక్కడా బ్రేకులు పడలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం తలకో మాట చెబుతోంది. గత రెండు నెలల కిందట రూ.11,400 కోట్లను కేటాయించి.. ఉక్కు పరిశ్రమను గాడిలో పెట్టేందుకు సమ్మతిస్తున్నట్టు పేర్కొంది.
ఇదే సమయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి సైతం విశాఖలో పర్యటించి.. ఫ్యాక్టరినీ ప్రైవేటీకరించ బోమన్నారు. కానీ.. మరోవైపు.. పార్లమెంటులో మాత్రం.. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని ఆర్థిక శాఖ చెబుతోంది. తాజాగా బుధ, గురువారాల్లో పార్లమెంటు సభ్యులు సంధించిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ ఈ సమాధానమే చెప్పడం గమనార్హం.
``2021లో పెట్టుబడుల ఉపసంహరణలపై నియమించిన కమిటీ విశాఖ ఉక్కు విషయంలో చేసిన సూచనల విషయంలో ఎలాంటి మార్పు లేదు`` అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో అటు కార్మిక సంఘాలు.. ఇటు రాజకీయ వర్గాలు కూడా.. తర్జన భర్జన పడుతున్నాయి. మరోవైపు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పెండింగులో ఉంది. ఈ పరిణామాలతో విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటన్నది చర్చగా మారుతుండడం గమనార్హం.