మచిలీపట్నం సముద్రంలో చిక్కిన 1500 కేజీల భారీ చేప.. ఇదెంత స్పెషల్ అంటే?

చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు భారీ చేపలు లభిస్తుంటాయి.

Update: 2024-07-29 07:30 GMT

చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు భారీ చేపలు లభిస్తుంటాయి. అయితే.. కొన్నిసార్లు మాత్రం జెయింట్ చేపలు లభిస్తుంటాయి. వాటి బరువు దగ్గర దగ్గర 500-600 కేజీల వరకు ఉంటుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం ఊహకు అందనంత భారీ చేపలు లభిస్తుంటాయి. తాజాగా అలాంటి భారీ చేప మచిలీపట్నంలోని మత్స్యకారులకు లభించింది. దీని బరువు ఏకంగా 1500 కేజీలు. అంటే.. 1.5 టన్నులన్నమాట. ఇంత భారీ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసుకురావటానికి చాలామంది కష్టపడాల్సి వచ్చింది.

సముద్ర ఒడ్డుకు చేర్చేందుకు భారీ క్రేన్ ను ఉపయోగించాల్సి రావటం గమనార్హం. క్రిష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద ఈ భారీ చేప దొరికింది. టేకు చేపగా పిలిచే ఈ చేప సాధారణంగా 500-600కేజీల మధ్య ఉన్నవి అప్పుడప్పుడు లభిస్తాయిన చెబుతున్నారు. ఇంత భారీ చేప దొరకటంతో తీర ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. దీన్నిచూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు పోటీ పడ్డారు.

సాధారణంగా ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ చేపకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని వేలంలో చెన్నై వ్యాపారులు సొంతం చేసుకున్నారు. కాకుంటే.. ఎంత ధరకు అమ్మారన్న విషయాన్ని స్థానికులు సైతం వెల్లడించకపోవటం గమనార్హం. అయితే.. ఈ భారీ టేకు చేపను ఎవరూ తినరని.. తినేందుకు పనికి రాని ఈ భారీ చేపలో దివ్యమైన ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు.

ఆయుర్వేదం మందుల్లోనూ.. ఇతర మెడిసిన్స్ తయారీలోనూ వినియోగిస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కంటిచూపును మెరుగుపర్చటంతో పాటు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నిర్మూలించే గుణం వీటికి ఉంటాయని చెబుతున్నారు. ఈ భారీ చేపలు సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటాయని.. సాధారణంగా బయటకు రావని చెబుతున్నారు. ఇంత భారీ చేప ఇటీవల కాలంలో ఎప్పుడూ దొరకలేదన్న సంతోషాన్ని.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ చేపతో కొందరి మత్స్యకారుల జీవితాలు పూర్తిస్థాయిలో సెటిల్ అవుతాయంటున్నారు.

ఈ భారీ టేకు చేప మామూలుగా చాలా ప్రశాంతంగా ఉంటుందని.. కానీ తనకు ముప్పు వాటిల్లుతుందన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇవి చాలా వయలెంట్ గా రియాక్టు అవుతాయని చెబుతున్నారు. సముద్రంలోని చిన్న చేపల్ని ఆహారంగా చేసుకొని భారీ సైజుకు మారే ఈ చేప వెనుక భాగంలో ఉండే ముళ్లు చాలా ప్రమాదకరమైనవిగా మత్స్యకారులు వివరిస్తున్నారు.

Tags:    

Similar News