కేసీఆర్ కు వరం...''కాంగ్రెస్ కు బాబు - బీజేపీకి కిరణ్''?

భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అలా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే పార్టీలో అసంతృప్తిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురైందని తెలుస్తుంది.

Update: 2023-07-23 04:16 GMT

తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దోస్తీ కట్టారు. తెలంగాణ జరిగే కాంగ్రెస్ సభల్లో వేదికపై విక్టరీ సింబల్ చూపిస్తూ.. కాంగ్రెస్ నేతలతో కలిసి చేతులు పైకెత్తేవారు. దాన్ని కేసీఆర్ పుష్కలంగా వాడుకున్నారని అంటుంటారు. ఆంధ్రా పెత్తనం అవసరమా అని ఫైరయ్యారు. ఫలితం తెలిసిందే!

ఆల్ మోస్ట్ అలాంటి సీనే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రిపీట్ అయ్యిందని తెలుస్తుంది. ఫలితంగా నాడు కేసీఆర్ కు చంద్రబాబు కాంగ్రెస్ వేదికలపై కనిపించడం ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వేదికలపై కనిపించడం కూడా అంతే ప్లస్ అవ్వొచ్చని అంటున్నారు పరిశీలకులు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అలా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే పార్టీలో అసంతృప్తిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురైందని తెలుస్తుంది.

అవును... కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రాకపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇక బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అయితే ఏకంగా సభ నుంచి వాకౌంట్ చేశారు. అనంతరం ఎందుకు అనేది ట్విట్టర్ లో తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఒకప్పుడు చెప్పిన వ్యక్తితో వేదిక పంచుకోవడం తనకు అసౌకర్యంగా ఉందని, అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

దీంతో పేరు చెప్పకుండానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి విజయశాంతి స్పందించారనే కామెంట్లు వినిపించాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.

ఇదే సమయంలో తాజాగా శనివారం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ చార్జి ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర ఇన్‌ చార్జ్‌ లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్‌ లు హాజరైన అల్పాహార సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పలువురు తెలంగాణ బీజేపీ నేతలు.. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఆహ్వానించడంలో కిషన్‌ రెడ్డి ఉద్దేశమేమిటని ప్రశ్నించారని తెలుస్తుంది.

కిరణ్‌ కుమార్‌ రెడ్డి వంటి ఆంధ్రా నాయకుడు ఉండటం వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు బీజేపీ జాతీయ నేతలకు చెప్పారని అంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని, తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ నేతలు జోక్యం చేసుకోవద్దని అధిష్టానాన్ని కోరారని సమాచారం.

ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడం ద్వారా తాము భారత రాష్ట్ర సమితికి ఆయుధాన్ని ఇచ్చాము.. బీఆరెస్స్ నేతలు దీన్ని కచ్చితంగా తమకు అనుకూలంగా మలచుకుని తెలంగాణ పట్ల తమ నిబద్ధతను ప్రశ్నిస్తారని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆఫ్ ద రికార్డ్ వాపోయారని అంటున్నారు.

ఏది ఏమైనా... బాధ్యతలు స్వీకరించిన 24గంటలు గడవకముందే కిషన్ రెడ్డిపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంం టి.బీజేపీలో కీలక విషయమే. మరి ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News