చింత చిగురు కేజీ రూ.వెయ్యి.. ఎందుకింత డిమాండ్?
సీజన్ కు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ చింత చిగురు ఆకు కోసం వెయిట్ చేసే వారు ఉంటారు.
చిటారు కొమ్మున కాచే చింత చిగురుకు మస్తు డిమాండ్ వచ్చేసింది. చింత చెట్టు ఆకులు రాలిన తర్వాత వచ్చిన చిగురుతో వంటలు సూపర్ టేస్టు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వెజ్.. నాన్ వెజ్ లో దీన్ని వాడుతూ వండే వంటలు రుచి అమోఘంగా ఉంటుందని చెబుతారు. సీజన్ కు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ చింత చిగురు ఆకు కోసం వెయిట్ చేసే వారు ఉంటారు.
తాజాగా మార్కెట్లోకి చింత చిగురు వచ్చేసింది. అయితే.. దీని ఖరీదు తెలిసిన వారు ఉలిక్కిపడుతున్నారు. వంద గ్రాముల చింత చిగురు వంద రూపాయిలు పలుకుతుంది. అది కూడా హోల్ సేల్ మార్కెట్లో. కేజీ అయితే మాత్రం రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. దీనికి ఎందుకింత డిమాండ్? అన్న విషయానికి వస్తే.. చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి ప్రాణాలకు తెగించి మరీ చింత చిగురును సేకరిస్తారు. అంత కష్టానికి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? అన్నది వీటిని సేకరించి తీసుకొచ్చే వారి ప్రశ్న.
చింత చిగురుతో చేసే పప్పు.. చికెన్.. మటన్ వంటకాల రుచి అదిరిపోతుందని చెబుతున్నారు. వీకెండ్ లో దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గడిచిన రెండు రోజులుగా మార్కెట్లోకి చింత చిగురు వచ్చింది. ఖర్చు గురించి ఆలోచించకుండా.. రుచి కోసం సెర్చ్ చేసే వారు.. మరికేమీ ఆలోచించకుండా చింత చిగురుతో వంటకాలు చేసేయండి.. ఆ రుచిని అస్వాదించండి.