భారీ ఆ(మ్)దానీ.. ఆయనే దేశంలో నంబర్ వన్ ధనికుడు
భారత దేశంలో అత్యంత ధనికుడి పేరు చెప్పమంటే రెండేళ్ల కిందటి వరకు తడుముకోకుండా ముఖేశ్ అంబానీ అనేవారు.
బహుశా గత రెండేళ్లలో ఆయన స్థాయిలో మరే పారిశ్రామికవేత్త కూడా వివాదాస్పదుడు కాలేదేమో..? లేదా.. ఆయనలాగా మరెవరూ విమర్శలు ఎదుర్కొనలేదేమో..? అమెరికా నుంచి ఏపీ వరకు అనేక వివాదాలు.. ఆయన కన్నుపడితే అమ్మాల్సిందే అనే ఆరోపణలు.. కోర్టు కేసులు.. షేర్లు పతనం.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడనే అపనిందలు.. చివరకు సంపదలో చాలా వరకు కోల్పోయిన వైనం.. ఆయన వ్యాపారాలు గాలి బుడగ అనేలా అనుమానులు.. కానీ, టాప్ ధనవంతుడి నుంచి కిందకు పడిపోయిన పరిస్థితి.. అయితే, ఇదంతా గతం. ఆయన మళ్లీ ఇపుడు పైకి లేచారు.
అంబానీ కాదు..
భారత దేశంలో అత్యంత ధనికుడి పేరు చెప్పమంటే రెండేళ్ల కిందటి వరకు తడుముకోకుండా ముఖేశ్ అంబానీ అనేవారు. ఆయన తప్ప మిగతావారు ఎవరూ ఆ స్థానాన్ని ఇప్పట్లో చేరుకోరని భావించారు. వరుసగా 2009 నుంచి 2022 వరకు భారత అత్యంత సంపన్నుడు అంబానీనే. లక్ష్మీ మిత్తల్, అజీమ్ ప్రేమ్ జీ, దిలీప్ సింఘ్వీ తదితరులను వెనక్కునెడుతూ అంబానీ ఏకఛత్రాధిపత్యంతో టాప్ రిచ్ పర్సన్ గా నిలిచారు. అలాంటివాడిని పడగొట్టారు గౌతమ్ అదానీ. 2022లో 118 బిలియన్ల సంపదతో గౌతమ్ అదానీ టాప్ ప్లేస్ కు వచ్చారు. అంబానీని రెండోస్థానానికి పరిమితం చేశారు.
హిండెన్ బర్గ్ దెబ్బతో..
అనేక రంగాల్లో దూసుకెళ్తున్న అదానీకి ఇక తిరుగులేదు అని భావిస్తుండగా సరిగ్గా ఏడాది కిందట హిండెన్ బర్గ్ రిసెర్చ్ సంస్థ పిడుగులాంటి సమాచారం వెల్లడించింది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీంతో అదానీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. కాగా, ఈ విషయమై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం.. నాలుగు పిటిషన్లపై బుధవారం తీర్పును వెలువరించింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును అనుమానించలేమని వెల్లడించింది. సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్ కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.
పడిలేచిన కెరటంలా..
అదానీ- హిండెన్ బర్గ్ వివాదంపై బుధవారం సుప్రీం తీర్పు నేపథ్యంలో గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల విలువ అదే రోజు గణనీయంగా పెరిగింది. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ధర ఓ దశలో 18 శాతం వరకు లాభపడింది. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 9 శాతానికి పైగా పుంజుకుంది. ఈ ఒక్కరోజే 10 నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓ దశలో రూ.1.18 లక్షల కోట్ల వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో శుక్రవారం నాటికి ముఖేశ్ అంబానీని వెనక్కునెట్టి గౌతమ్ అదానీ భారత అత్యంత ధనికుడిగా నిలిచారు. శుక్రవారం ఉదయం 9.30కు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అంబానీ సంపద 97 బిలియన్ డాలర్లు అని తెలిపింది.