ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ... హెచ్-1బీ జీవిత భాగస్వాములకు కష్టాలు తప్పవా?

ఈ సమయంలో... డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికాలోని వర్క్ వీసా హోల్డర్లు పడిన ఇబ్బందులు మరోసారి చర్చకు వచ్చాయి

Update: 2024-09-18 04:29 GMT

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫీవర్ పీక్స్ కి చేరిన నేపథ్యంలో... ఎవరు అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి మేలు, మరెవరికి ఎలాంటి సమస్య అనే విషయాలపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ సమయంలో... డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికాలోని వర్క్ వీసా హోల్డర్లు పడిన ఇబ్బందులు మరోసారి చర్చకు వచ్చాయి.

ఈ క్రమంలో ట్రంప్ ఈసారి కూడా గెలిస్తే అతని ఇమ్మిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు హెచ్-1బీ వీసాదారులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా సరికొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉందనే కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు పని అధికారాన్ని తీసివేయడానికి ప్రయత్నించొచ్చని అంటున్నారు.

అవును... తాజాగా వెలువడిన ఫోర్బ్స్ కథనం ప్రకారం... ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అధికారాన్ని తీసివేయడానికి ప్రయత్నించొచ్చని.. లేదా, సుదీర్ఘ ప్రాసెసింగ్ ప్రక్రియతో అయినా పరిస్థితిని క్లిష్టతరం చేయవచ్చని తెలిపింది. ఈ విధంగా హెచ్-1బీ హోదాలో ఉండటానికి ఆమోదం పొందడాన్ని మరింత క్లిష్టతరం చేయడానికి ట్రంప్ అధికారులు ప్రయత్నించొచ్చని అభిప్రాయపడింది.

ఇదే సమయంలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ ల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వారిపైనా ట్రంప్ కొత్త పరిపాలనా విధానాలు ప్రభావం చూపుతాయని తెలిపింది.

వాస్తవానికి 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తూ నిబంధనను జారీ చేసింది. అయితే 2018లో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు పని చేయడానికి అనుమతించే విధానాన్ని తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం తన ఉద్దేశ్యాన్ని ప్రకటించింది!

కాగా... యూనివర్శిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా ఎకనామిక్స్ ప్రొఫెసర్ మండేలిన్ జావోడ్నిచే.. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విశ్లేషణ ప్రకారం సుమారు 90శాతం మంది హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు. సగానికిపైగా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు!

Tags:    

Similar News