'మొండిఘటం కిమ్.. ఎలా ఉన్నారు'?.. సైనికులతో ట్రంప్ శాటిలైట్ ఫోన్

ఇక అధ్యక్షుడిగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ఆ వెంటనే కిమ్ గురించి ఆరా తీశారు. "ఆయనో మొండి ఘటం. ఓ పట్టాన మాట వినరు.

Update: 2025-01-21 09:43 GMT

రోగ్ కంట్రీ.. ఉత్తర కొరియాపై అమెరికా వేసిన ముద్ర ఇది. గతంలోని అమెరికా అధ్యక్షులు అందరూ అలానే చూశారు కూడా. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ను నియంతగా, క్రూరుడిగా అభివర్ణించేవారు. కానీ, ట్రంప్ మాత్రం వేరే విధంగా చూశారు. దాదాపు అసాధ్యం అనుకున్న కిమ్ తో భేటీ అయ్యారు కూడా. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేంది ఈ పరిణామం. ఇది జరిగి ఐదేళ్లు దాటింది.

కాగా, ట్రంప్ ఓటమితో 2021 తర్వాత ఉత్తర కొరియాతో అమెరికా సంబంధాలు మరింత క్షీణించాయి. అయితే, ఇప్పుడు మళ్లీ ట్రంప్ రాకతో అనూహ్యం జరిగేలా కనిపిస్తోంది.

మిగతా ప్రంపచానికి దూరంగా ఉండే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. 2019లో ట్రంప్ తో సమావేశం అయ్యారు. వీరిద్దరూ తటస్థ వేదిక వియాత్నాంలో భేటీ అయ్యారు. అయితే, అణ్వాయుధాలు వదిలేయడంలో కిమ్ ససేమిరా అన్నారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.

ఇక అధ్యక్షుడిగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ఆ వెంటనే కిమ్ గురించి ఆరా తీశారు. "ఆయనో మొండి ఘటం. ఓ పట్టాన మాట వినరు. గతంలో మంచి సంబంధాలు నెలకొల్పాను. కిమ్ ఎలా ఉన్నారు?" అంటూ దక్షిణ కొరియాలోని అమెరికా సైనికులతో ట్రంప్ ఆరా తీశారు. దక్షిణ కొరియాలో అమెరికా బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రమాణం తర్వాత సైనికుల గౌరవార్థం బాల్‌ డ్యాన్స్‌ లో పాల్గొని దక్షిణ కొరియాలోని అమెరికా సైనికులకు ట్రంప్ శాటిలైట్ కాల్ చేసి మాట్లాడారు. ఆ సందర్భంగానే కిమ్ గురించి ప్రస్తావన తెచ్చారు. ఈ ఘటన నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది.

2017లో ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక తొలినాళ్లలో ఉత్తర కొరియాపై కాలుదువ్వారు. తర్వాత శాంతించారు. చివరకు కిమ్ తో సమావేశం అయ్యారు. కిమ్.. 20 రోజులు గాయబ్ అయి తిరిగి రాగా, ట్రంప్ స్పందిస్తూ ఆయన తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కొసమెరుపు: కిమ్ కు తానంటే ఎంతో ఇష్టమని ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, కిమ్‌ మాత్రం అమెరికాను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ట్రంప్‌ వచ్చినా వ్యక్తిగత దౌత్యాలు ఉండనంతగా వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News