ఇంతటితో వదిలేయండి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో స్పందన
దీంతో చైర్మన్, ఈవో మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు చైర్మన్, ఈవోకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్, ఈవో మధ్య సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా తమ మధ్య సమన్వయం ఉందని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చైర్మన్, ఈవో ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం టోకెన్ల కోసం తిరుపతి బైరాగిపట్టెడ స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మధ్య సమన్వయం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. చైర్మన్ మాటను ఈవో లెక్కచేయడం లేదని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా సీఎం సమక్షంలో ఇరువురు ఏకవచనంతో వాగ్వాదానికి దిగినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చైర్మన్, ఈవో మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు చైర్మన్, ఈవోకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ దిగివచ్చి తమ మధ్య సమన్వయం ఉందని చాటిచెప్పేలా సోమవారం ప్రకటనలు గుప్పించారు.
బైరాగిపట్టెడ స్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాటపై మరోమారు విచారం వ్యక్తం చేసిన చైర్మన్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తొక్కిసలాట తర్వాత లేనిపోని అంశాలను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈవోకు మధ్య విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని చైర్మన్ నాయుడు ఖండించారు. టీటీడీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను ఈవో అమలు చేయడం లేదన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇకపై టీటీడీలో ఏదైనా చేసే ముందు అందరికీ చెప్పే చేస్తామన్నారు. టీటీడీ పేరుతో అసత్య కథనాలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో తొక్కిసలాట తప్ప మిగతా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రశంసించారు. అధికారుల శ్రమను గుర్తించాలని కోరారు. టీటీడీకి సంబంధించిన ఎటువంటి సమాచారం కావాలన్నా తనను సంప్రదించాలని, తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించారు.
ఇక ఇదే ఘటనపై ఈవో శ్యామలరావు కూడా స్పందించారు. చైర్మన్ బీఆర్ నాయుడితో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తర్వాత విధి నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల టీటీడీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేకపోయామని చెప్పారు. ఈవో, చైర్మన్ మధ్య సమన్వయం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ప్రజలు వాటని నమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రచారంపై విచారం వ్యక్తం చేసిన ఈవో, ఇకపై టీటీడీ బోర్డు పర్యవేక్షణలోనే నిర్ణయాలు అమలు చేస్తామన్నారు. ముఖ్యమైన అంశాలపై బోర్డులో చర్చించి, బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.
అందరూ సమన్వయంతో పనిచేశామని, తిరుపతిలోని ఓ స్కూలులో తొక్కిసలాట జరిగిందని ఈవో వివరించారు. భక్తులను వదిలే క్రమంలో కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని, దానివల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఇకపై వాటిని పునరావృత్తం కానివ్వమని వివరించారు. మొత్తానికి వారం రోజుల తర్వాత టీటీడీలో విభేదాలపై చైర్మన్, ఈవో స్పందించడంతో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనని చెబుతున్నారు.