అతడిని తొలగించాల్సిందే.. తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల మెరుపు ధర్నా

టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను పాలకమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట మెరుపు ఆందోళనకు దిగారు.

Update: 2025-02-20 08:47 GMT

టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను పాలకమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట మెరుపు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం శ్రీవారి ఆలయంలో ఉద్యోగి బాలాజీ పట్ల బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనుచితంగా ప్రవర్తించి దూషించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులను చిన్నచూపు చూసేవారికి టీటీడీలో కొనసాగే అర్హత లేదని ఉద్యోగులు నినాదాలు చేశారు.

కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ టీటీడీ పాలకమండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన ఆయన.. దర్శన అనంతరం మహాద్వారం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీ నిబంధనలు గుర్తు చేస్తూ వేరే మార్గం మీదుగా వెళ్లాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం వద్దే సహనం కోల్పోయి ఉద్యోగిపై బూతులు ప్రయోగించాడు. రాయడానికి వీలులేని భాషలో తిట్టాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే రెండు రోజులుగా టీటీడీలో ఈ గొడవపైనే చర్చ జరుగుతోంది.

ఇక శుక్రవారం ఆకస్మికంగా ఉద్యోగులు తిరుపతిలో ఆలయ పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగిని బూతులు తిట్టిన బోర్డు సభ్యుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఉద్యోగులు ఆందోళన చేయడంతో పారిపాలన భవనం వద్ద కలకలం రేగింది. అయితే ఉద్యోగులు ఆందోళనకు అనుమతించిన అధికారులు.. మీడియోతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. దాదాపు రెండు గంటలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేసిన ఉద్యోగులు మీడియాతో మాత్రం మాట్లాడలేదు. అయితే టీటీడీ చరిత్రలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News