ఆ ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పిన తులసిబాబు!
అప్పటి ఎంపీ ఇప్పటి ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామక్రిష్ణరాజుపై 2021లో జరిగిన హత్యయత్నం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబు గరించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అప్పటి ఎంపీ ఇప్పటి ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామక్రిష్ణరాజుపై 2021లో జరిగిన హత్యయత్నం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబు గరించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ సానుభూతిపరుడిగా.. క్రిష్ణా జిల్లాలో హడావుడి చేసే అతడ్ని.. ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతడ్ని .. రఘురామ క్రిష్ణరాజు కేసులో విచారిస్తున్నారు.
విచారణలో తులసిబాబు తీరుతో పోలీసులు ఫస్ట్రేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా.. దేనికీ సమాధానం చెప్పని అతడి తీరు చర్చగా మారింది. బాపట్ల జిల్లాకు చెందిన తులసిబాబు.. క్రిష్ణా జిల్లాలో అందునా గుడివాడ రాజకీయాలతో అతడికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలతో తిరిగే అలవాటున్న తులసిబాబు తీరును ఆరా తీస్తున్నారు.
తరచూ ప్రభుత్వ కార్యాయాల్లో తిరగటం.. ఎవరి అండతో అతనీ పనులు చేస్తున్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. దుబాయ్ లో అతడికి ఉన్న వ్యాపారాలు ఏమిటి? వాటికి ఇక్కడి నుంచి ఎలా నడుపుతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించిన ఎస్పీకి తులసిబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.
సోమవారం ఉదయం 11 గంటలకు పోలీసులు కస్టడీలో తీసుకోవటం.. ఆ వెంటనే హైబీపీ కారణంగా ఆ రోజు సాయంత్రం ఐదున్నర వరకు గుంటూరు జీజీహెచ్ లోనే ఉంచటం తెలిసిందే. రాత్రి వేళలో అతడ్ని తీసుకొచ్చిన పోలీసులు కాసేపు విచారించారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ రోజంతా దర్యాప్తుచేసినా.. తులసిబాబు నోటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెబుతున్నారు.
ప్రశ్నలు వేసి.. వేసి.. పోలీసులు అలిసిపోయారే తప్పించి అతడు మాత్రం నోరు విప్పలేదంటున్నారు. అదే పనిగా ప్రశ్నలు సంధించినా సమాధానం చెప్పని అతను.. వైసీపీ సర్కారులో సీఐడీకి న్యాయ సలహాదారుగా వ్యవహరించావా? అన్న ప్రశ్నకు ‘అవును’ అని మాత్రమే బదులిచ్చాడని.. మిగిలిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా తులసిబాబు టీడీపీకి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతున్న వేళ.. అలాంటిదేమీ లేదంటూ తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేయటం గమనార్హం. ఈ క్లారిటీ ప్రకటన ఏదో ముందే ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.