'కుంభ మేళా'... 2 వేల కోట్ల సంబరం!
ఈ మొత్తం 2 వేల కోట్లలో రాష్ట్ర(యూపీ) వాటా ఎంత..? కేంద్రం ఇచ్చేది ఎంత? అనేది ఇంకా తేలలేదు.
వంద కోట్లు అంటేనే గుండెలు బాదుకుంటాం. అలాంటిది వెయ్యికాదు.. రెండు వేల కోట్ల రూపాయలను కుంభమేళా కోసం వెచ్చిస్తున్నారు. ఇది సాధారణంగా ఒక రాష్ట్రంలో ఖర్చు పెడితే కీలకప్రాజెక్టులు పూర్త వుతాయి. పోలవరం లేదా అమరావతి వంటి ప్రాజెక్టులకు అయితే.. జీవం పోసినట్టే. అంత పెద్ద మొత్తం లో నిధులను కుంభమేళాకు ఖర్చు చేస్తున్నారు. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని ప్రారంభమ య్యే(మకర సంక్రమణం) ఈ వేడుకలకు యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా సిద్ధమైంది.
ఈ మొత్తం 2 వేల కోట్లలో రాష్ట్ర(యూపీ) వాటా ఎంత..? కేంద్రం ఇచ్చేది ఎంత? అనేది ఇంకా తేలలేదు. పనులు మాత్రం పూర్తవుతున్నాయి. మొత్తం జనవరి 13 నుంచివరుసగా 45 రోజుల పాటు ఈ కుంభ మేళా నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా.. ఈ కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని యూపీ ప్రభుత్వం `కళా గ్రామ్` పేరుతో ప్రత్యేక జిల్లాగా నిర్ణయించి.. కొన్నాళ్ల కిందటే గెజిట్ కూడా జారీ చేసింది. దీంతో జిల్లాకు ఉండే అన్ని హక్కులు, అధికారాలు కూడా ఇక్కడి అధికారులకు వస్తాయి. ప్రత్యేకంగా ఒక కలెక్టర్‌ను ఇద్దరు జేసీలను నియమిం చారు.
ఇక, ఏర్పాట్ల పరంగా చూస్తే.. కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయన్నది వాస్తవం. మరి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు కామనే కదా! 50 వేల మంది రాష్ట్ర పోలీసులు.. భద్రతకు నియోగిస్తున్నారు. ఇక, కేంద్ర బలగాలు 1000 ప్లాటూన్లు ఇస్తున్నారు. వీరు కాకుండా.. వీఐపీ భద్రత, వీవీఐపీ భద్రత ప్రత్యేకంగా ఉంటుంది. కుంభమేళా జరిగే జిల్లాలో మొత్తం 18 మార్గాలను ఏర్పా టు చేశారు. ప్రతి మార్గాన్నీ భద్రతతో కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు.
వైద్య బృందాలను విరివిగా ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను వేలాది మందిని ఈ 45 రోజుల పాటు.. నెల జీతంపై నియమించారు. ఏఐతో పనిచేసే 2700 కెమెరాలను అన్ని ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. దేశంలోని దాదాపు 11 భాషల్లో పనిచేసేలా.. యాత్రికులకు ఎలాంటి సమాచారం కావాలన్నా.. చిటికెలో తెలిసేలా చాట్‌బాట్‌లు అందుబాటులోకి తెచ్చారు. `నేత్ర కుంభ్`, `భీష్మ కుంభ్` పేరుతో వేలాది ఆసుపత్రులను టెంపరరీగా ఏర్పాటు చేయడం విశేషం. 92 రోడ్లను బాగు చేసి.. సుందరంగా తీర్చిదిద్దారు. 32 నీటిపై తేలియాడే వంతెనలు నిర్మించారు.
చేతినిండా డబ్బులు!
అయితే.. కుంభమేళాకు వెళ్లే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా.. చేతినిండా డబ్బులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుంభమేళాకు ఖర్చు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రత్యేక పద్దు కింద.. ఇక్కడ నిర్వహించే వ్యాపారాలపై 18-25 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అదేవిధంగా ఆటోరిక్షాల చార్జీలు, క్యాబుల చార్జీలు, నదీ విహారానికి వినియోగించే పడవల చార్జీలను కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రెట్టింపు చేసింది. తినుబండారాల నుంచి అన్ని వస్తువుల ధరలపై మినిమం 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. అంటే.. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు పేలనున్నాయి. కాబట్టి.. చేతినిండా డబ్బులు తీసుకువెళ్లకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఇక, దేశవ్యాప్తంగా రైల్వే శాఖ వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటి ధరలపై ఇంకా నిర్ణయానికి రాలేదు.