వీహెచ్ కోసం పెద్ద పదవి : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు వీ.హన్మంతరావు (వీహెచ్) ఆశలు నెరవేరనున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు వీ.హన్మంతరావు (వీహెచ్) ఆశలు నెరవేరనున్నాయి. చాలా కాలంగా ఏదో నామినేడెట్ పదవి కోసం ఎదురుచూస్తున్న వీహెచ్ కు అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల ముందు సీనియర్లకు పదవులు కేటాయించాలని హైకమాండ్ సూచించడంతో ముందుగా వీహెచ్ కు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో వీహెచ్ చాలా సీనియర్. పార్టీ అధిష్టానానికి వీర విధేయుడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా వీహెచ్ మాత్రం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వస్తున్నారు. ఇక వయసు రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడలేకపోయిన ఆయన నామినేడెట్ పదవిపై ఆశ పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరారు. అయితే ఆయనకు వయోభారం ఉండటంతో అధిష్టానం పక్కనపెట్టింది. అప్పట్లోనే నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకు బీసీ కమిషన్ పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా, వీహెచ్ ఆ పదవికి నిరాకరించారు. బీసీ కమిషన్ అంటే రాజ్యాంగ పదవి అవుతుందని, ఆ పదవిలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సివస్తుందన్న ఆలోచనతో వీహెచ్ వద్దనుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆయనకు ఏ పదవి ఇవ్వాలన్నదానిపై కాంగ్రెస్ అధిష్ఠానం తర్జనభర్జన పడిందంటున్నారు.
అయితే ఎట్టకేలకు వీహెచ్ పదవిపై కాంగ్రెస్ కు క్లారిటీ వచ్చింది. మరో రెండు నెలల్లో శాసనమండలి చైర్మన్ పదవి ఖాళీ అవుతోంది. క్యాబినెట్ హోదా ఉండే ఆ పదవిని వీహెచ్ కు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీహెచ్ ను ఎమ్మెల్సీ చేసి, అనంతరం శాసనమండలి చైర్మన్ చేయాలని సీఎం ఆలోచనగా చెబుతున్నారు. దీనికి వీహెచ్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ పదవితోపాటు పార్టీలోనూ వీహెచ్ కు తగిన గౌరవం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్ పదవిని కూడా వీహెచ్ కు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందంటున్నారు.
కులగణనపై కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువ ఫోకస్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలనే విషయమై ఆ పార్టీ విధానంగా చెబుతున్నారు. అయితే కేంద్రంలో అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ ఆలోచనకు కార్యరూపం దాల్చడంలేదు. జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో కులగణన పూర్తి చేసినందున.. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా వీహెచ్ తోపాటు మిగతా బీసీ నేతలకు త్వరలో పదవులు వరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.