టీమ్ ఇండియా మాజీ స్టార్ ఆరోగ్యం అత్యంత విషమం

అంతా బాగుంటే అతడు దిగ్గజంగా రిటైర్ కావాల్సినవాడు.. అతడి స్థానంలో వచ్చినవారు ఎంతో సక్సెస్ అయి కెప్టెన్లుగా రిటైర్ అయ్యారు.

Update: 2024-12-23 20:30 GMT

అంతా బాగుంటే అతడు దిగ్గజంగా రిటైర్ కావాల్సినవాడు.. అతడి స్థానంలో వచ్చినవారు ఎంతో సక్సెస్ అయి కెప్టెన్లుగా రిటైర్ అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించారు. అంతకుమించిన పేరు కూడా పొందారు. కానీ, ఇతడు మాత్రం బీసీసీఐ ఇచ్చే రూ.30 వేలు పింఛను మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. అంతేకాదు.. తీవ్ర అనారోగ్యంతో పదేపదే ఆస్పత్రి పాలవుతున్నాడు.

‘వినోద్’ పేరులోనే జీవితంలో లేదు

వినోద్ కాంబ్లీ.. ఈ పేరు భారతీయ క్రికెటర్లు అందరికీ పెద్ద గుణపాఠం. కెరీర్ ప్రారంభంలోనే అద్భుత సెంచరీలు.. అంతకుమించిన దూకుడుతో.. ఫ్యాషన్ తో అభిమానులు సంపాదించాడు. తన చిన్ననాటి మిత్రుడు, టీమ్ ఇండియాలోనూ సహచరుడైన సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ, దేనినీ నిలుపుకోలేదు. దీంతో అతడి పేరులోనే వినోదం తప్ప జీవితంలో లేకపోయింది.

క్రమశిక్షణ తప్పాడు.. కెరీర్ గతి తప్పింది

వినోద్ కాంబ్లీ క్రమశిక్షణ లోపం అతడి జీవితాన్నే కూల్చేసింది. అర్థరాత్రి వరకు పార్టీలు, అమ్మాయిలను హోటల్ రూమ్ కు తెచ్చుకోవడం, జట్టు క్రమశిక్షణ పాటించకపోవడంతో ఏకాగ్రత దెబ్బతిన్నది. ఫామ్ కోల్పోయాడు. చివరకు జట్టులో చోటే లేకపోయింది. సచిన్ ప్రమేయంతోనే ఏమో 9 సార్లు టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసినా నిలుపుకోలేకపోయాడు.

ఆరోగ్యం అత్యంత విషమం

కాంబ్లీ ఆరోగ్యం 2013 నాటికే దెబ్బతిన్నది. పెద్ద శస్త్రచికిత్స కూడా జరిగింది. చివరకు ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇటీవల 1983 ప్రపంచ కప్ విజేత జట్టుకు సన్మాన కార్యక్రమంలో కాంబ్లీ పరిస్థితి చూసినవారు ఆశ్చర్యపోయారు. చివరకు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచన మేరకు కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఒప్పుకొన్నాడు. కాగా, ఆదివారం రాత్రి కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అవసరమైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికైతే నిలకడగా ఉన్నప్పటికీ.. ఆందోళనకరమేనని అంటున్నారు.

Tags:    

Similar News