వైసీపీ ఆశలపై నీళ్లు!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోని వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

Update: 2024-12-18 13:30 GMT

జమిలి ఎన్నికలు 2027లోనే జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావొచ్చని కలలు కన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చిందా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోని వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తమ పార్టీకి ఎదురుగాలి వీచినా, అదంతా ఈవీఎంల మాయాజాలం అంటూ తొలుత చెప్పుకున్న వైసీపీ నాయకత్వం.. ఆ తర్వాత జమిలి ఎన్నికలు వస్తే మళ్లీ తాము అధికారంలోకి వస్తామని చెప్పుకుంది. జమిలి ఎన్నికలు దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందని, కూటమి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదని, రెండున్నర, మూడేళ్లకే సార్వత్రిక ఎన్నికలు జరిగితే అప్పుడు గెలిచి తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆశించింది వైసీపీ.

ప్రతిపక్షంలో కొనసాగలేకపోతున్న వైసీపీ ఎప్పుడు జమిలి జరుగుతుందా? అని ఎదురుచూస్తోంది. అందుకే కేంద్రం జమిలి బిల్లు ప్రవేశపెడితే భేషరతుగా మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ఏపీలో గత 25 ఏళ్లుగా జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మొత్తం ఎన్నికల ప్రక్రియే మారుతుందని భావించిన వైసీపీ, ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంచనా వేసింది. అయితే కేంద్రం మాత్రం లోక్ సభ గడువు ప్రకారమే జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిండంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.

గత కొద్దిరోజులుగా కూటమి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదని వైసీపీ ప్రచారం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయని ఈ మధ్య ప్రకటించారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, ఆ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ ఆశలన్నీ నీరుగారిపోయాయి.

ఏపీలో ప్రస్తుతం జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 1999 నుంచి ఇప్పటివరకు కేంద్రం, ఏపీకి ఉమ్మడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2018లో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో ఆ రాష్ట్రంలో ఆర్నెల్లు ముందుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు జమిలి వస్తే మళ్లీ యథావిధిగా లోక్ సభతోపాటు తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ, ఏపీలో జమిలితో ఎలాంటి మార్పు లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలు కోరుకుంది. కూటమికి తిరుగులేని మెజార్టీ ఉండటం, అందులోనూ టీడీపీకి సొంతంగా 135 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే అంత త్వరగా అధికార పీఠం దక్కించుకోవచ్చిన ఆశించింది. ఈ దిశగా తమ కార్యకర్తలకు సంకేతాలు పంపింది.

తాను ఒకటి తలిస్తే కేంద్రం మరోకటి చేయడంతో వైసీపీ జీర్ణించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్రం అడగకపోయినా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2029 వరకు వేచిచూడక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందనేది చూడాల్సివుంది.

Tags:    

Similar News