టెక్క‌లి వైసీపీలో త‌న్నులాట‌.. ఏం జ‌రిగింది ..!

దువ్వాడ శ్రీనివాస్ డ‌బుల్ ఫ్యామిలీ వ్య‌వ‌హారం రచ్చకెక్కడంతో మార్పు చేశారు.

Update: 2024-11-20 14:30 GMT

శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత ముఖ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గం టెక్క‌లి. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న ది వైసీపీ క‌ల‌. అయితే.. ఈ క‌ల‌ను సాకారం చేసే నాయ‌కుడే క‌నిపించ‌డం లేదు. నాయ‌కుల‌ను మార్చినా.. ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను మాత్రం వైసీపీ గెల‌వ‌లేక‌పోతోంది. తాజాగా కొన్నాళ్ల కింద‌ట టెక్కలి సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తొలుత తొలగించి ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను సమన్వ యకర్తగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ డ‌బుల్ ఫ్యామిలీ వ్య‌వ‌హారం రచ్చకెక్కడంతో మార్పు చేశారు.

అయితే.. ఇప్పుడు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌న్వ‌యం క‌నిపించ‌డం లేదు. టెక్క‌లి వైసీపీ లో నాయ‌కు లు రెండుగా చీలిపోయారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల‌ను తూ.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నాన‌ని చెప్పుకొనే దువ్వాడ‌.. తెర‌చాటున అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో వేడెక్కిస్తున్నారు. త‌న‌కు ఉన్న ఎమ్మెల్సీ ప‌ద‌విని అడ్డు పెట్టుకుని పేరాడ‌కు స‌హ‌క‌రించ‌కుండా ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను ఆయ‌న క‌ట్ట‌డి చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌కు చెప్పాల‌ని నాయ‌కుల‌ను ఆదేశిస్తున్నారు.

దీంతో పేరాడ వ‌ర్గం కూడా మౌనంగా ఉండిపోయింది. నిజానికి టెక్క‌లిలో టీడీపీ హ‌వా ఎక్కువ‌గా ఉంద న్న విష‌యం తెలిసిందే. బ‌ల‌మైన అచ్చెన్న నాయ‌క‌త్వం.. కేడ‌ర్ వంటివి ఇక్క‌డ టీడీపీని ఎదురులేని శ‌క్తిగా మ‌లిచాయి. ఇలాంటి చోట వైసీపీ పాగావేయాలంటే నాయ‌క‌లు మ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌రం. క‌లివిడిగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. కానీ, ఈ విష‌యంలో దువ్వాడ వ‌ర్సెస్ పేరాడ మ‌ధ్య రాజ‌కీయాలు హోరెత్తి పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా తానే మ‌ళ్లీ పోటీ చేస్తాన‌ని దువ్వాడ చెబుతున్న తీరు.. పేరాడ వ‌ర్గంలో ఆగ్ర‌హాన్ని ర‌గిలిస్తోంది. అయితే.. అధిష్టానం నుంచి దువ్వాడ‌కు మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉండ‌డం, ఆయ‌న మాట‌కే వాల్యూ ఉండ‌డంతో పేరాడ తిల‌క్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అటు దువ్వాడ, ఇటు పేరాడ ఇద్ద‌రు మౌనంగా ఉండ‌డంతో పార్టీ కార్య‌క్ర‌మాలు కానీ.. కేడ‌ర్‌లో ఉత్సాహం కానీ ఏదీ క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ ఆధిప‌త్య పోరుకు ఎప్పుడు తెర‌ప‌డుతుందో చూడాలి.

Tags:    

Similar News