స్కిల్ సిటీకి అదానీకి మించి మేఘా సాయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2024-10-27 07:12 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. మేఘా విషయంలో మాత్రం సానుకూలత కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు తీసుకొని.. పూర్తి చేసే ఈ సంస్థకు తెలగు రాష్ట్రాలకు బయట కూడా పరపతికి ఢోకా లేదనే చెప్పాలి. ఎప్పుడూ ఇన్ కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ అన్నది ఉండదన్న మాటకు భిన్నంగా మేఘా తీరు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల నగరంగా పేరొందిన ఫోర్త్ సిటీలో పెద్ద ఎత్తున సంస్థల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న స్కిల్ వర్సిటీ విషయంలో పలు పారిశ్రామిక సంస్థలు భారీ విరాళాల్నిప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదానీ సంస్థ స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్ల విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకు రాగా.. తాజాగా అదానీకి మించి అన్నట్లుగా మేఘా సంస్థ రూ.200కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించింది.

యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి రూ.200 కోట్ల ఖర్చును భరించేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ భారీ విరాళంలో భాగంగా క్యాంపస్ లో అవసరమైన భవనాల్నినిర్మిస్తారు. దీని బాధ్యతను మేఘా తీసుకుంది. ప్రపంచ స్థాయి ఆధునిక సదుపాయాలు ఉండేలా స్కిల్ వర్సిటీ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలోనే అతి శక్తివంతమైన కంపెనీల్లో ఒకటైన అదానీకి మించిన విరాళాన్ని ప్రకటించటం ద్వారా మేఘా తన ప్రత్యేకతను నిలుపుకుందని చెప్పాలి.

Tags:    

Similar News