ఎయిర్‌ పోర్టులో యూట్యూబర్ షాపు... తెరపైకి షాకింగ్ ఇష్యూ!

విమానాశ్రయంలో ఓ షాపు లీజుకి తీసుకున్న ఓ యూట్యూబర్... బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారికి సాయం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది

Update: 2024-07-02 07:30 GMT

విమానాశ్రయంలో ఓ షాపు లీజుకి తీసుకున్న ఓ యూట్యూబర్... బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారికి సాయం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమారు గత రెండు నెలలుగా ఇక్కడ నుంచి జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ విషయాలు తెలుసుకుని పోలీసులే విస్తుపోయారని అంటున్నారు. ఈ ఘటన చెన్నైలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద వెలుగు చూడగా.. శ్రీలంక, అబుదాబీలకూ లింక్ ఉన్నట్లు చెబుతున్నారు.

అవును... చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఒక షాపు అద్దెకు తీసుకున్న ఓ యూట్యూబర్... శ్రీలంకకు చెందిన బంగారం స్మగ్లింగ్ ముఠాకు సహాయం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా.. మహ్మద్ సబీర్ అలీ అనే యూట్యూబర్.. ఎయిర్ హబ్ రిటైల్ పేరుతో ఓ షాపును అద్దెకు తీసుకున్నాడు.

ఈ సమయంలో.. అతడికి అబుదాబీలో నివసిస్తున్న సిండికేట్ సభ్యుడు ఒకరు ఆర్థిక వనరులు సమకూర్చారని.. ఇందులో భాగంగా లీజు కోసం రూ.70 లక్షలు ఇచ్చాడని చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ లోని డిపార్చర్ లాంజ్ సమీపంలో షాపు ఏర్పాటుచేసిన సబీర్ అలీ... రెండు నెలల్లో సుమారు 167 కోట్ల రూపాయలు విలువచేసే 267 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడంలో సహకరించినట్లు చెబుతున్నారు.

దీనికోసం సబీర్ అలీ షాపులో పనిచేసే ఏడుగురు ఉద్యోగులకు బంగారాన్ని అక్రమంగా తరలించడానికి స్మగ్లింగ్ ముఠా శిక్షణ కూడా ఇచ్చిందంట. అధికారికంగా బొమ్మలు, బ్యాగులూ అమ్మే ఈ షాపులో నుంచే బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారట. ఫలితంగా... సబీర్ అలీ గత రెండు నెలల్లోనే కమిషన్ కింద సుమారు రూ.3 కోట్లు సంపాదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదే సమయంలో సబీర్ అలీ షాపులో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగుల వద్ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఐడీ కార్డులు కూడా ఉన్నాయంట. దీంతో ఈ వ్యవహారంపైనా కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News