ఉత్తర్వులు జారీ... కూటమి ప్రభుత్వంలో జగన్ సలహాదారు!

అయితే... గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఓ వ్యక్తిని.. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా సలహాదారుగా నియమించుకొంది.;

Update: 2025-03-14 19:30 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలోని వివిధ శాఖలకు, పలు రంగాలకు సంబంధించి పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్న సంగతి తెలిసిందే! వీరి సంఖ్య సుమారు 50కి పైగా ఉందని.. రాజకీయ నిరుద్యోగులకు సలహాదారు అనే ట్యాగ్ లైన్ తగిలించి ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారనే విమర్శలు నాడు బలంగా వినిపించాయి!

అయితే.. అందులో ఎక్కువభాగం అలంకారంగా ఉపయోగించుకోవడానికే తప్ప.. వాస్తవంగా వారి నుంచి ప్రభుత్వానికి వచ్చిన సలహాలు ఎన్ని, ఆ సలహాల వల్ల కలిగిన ప్రయోజనం ఎంత అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నే అని అంటారు! దీనిపై గతంలో అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ కూడా తీవ్ర చర్చ జరిగేదని చెబుతారు.

ఇంకొక అడుగు ముందుకేసి... 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంలో నాటి ప్రభుత్వంలోని సలహాదారుల ప్రమేయమే కారణం అని చెప్పేవాళ్లు లేకపోలేదు. అలా అని అందరినీ ఆ గాటిన కట్టలేము కానీ.. నిజంగా ప్రభుత్వానికి ఉపయోగపడే స్థాయి ఉండి, ఆ పని సక్రమంగా చేసినవారిని వేళ్లపై లెక్కించొచ్చని మాత్రం చెబుతారు.

కట్ చేస్తే... ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అనంతరం... గత ప్రభుత్వ హయాంలో సలహాదారులుగా ఉన్న వారితో వెంటనే రాజీనామాలు చేయించారని చెబుతారు. కొంతమంది ఫలితాలు వచ్చిన వెంటనే రాజీనామాలు చేశారని అంటారు. ఇక.. ఈ తొమ్మిది నెలల్లోనూ చంద్రబాబు కూడా పలువురు సలహాదారులను నియమించుకున్నారు!

అయితే... గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఓ వ్యక్తిని.. తాజాగా కూటమి ప్రభుత్వం కూడా సలహాదారుగా నియమించుకొంది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగుతారని పేర్కొంది.

అవును... సెప్టెంబర్ 2021లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి ప్రజారోగ్యం, రాష్ట్రంలో సమగ్ర క్యాన్సర్ సంరక్షణ మొదలైన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశం జరిగిన కొద్ది కాలానికే ఆయనను జగన్ సర్కార్.. ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అయితే కూటమి సర్కార్ కూడా ఆయనను కంటిన్యూ చేస్తోంది!

ఈ సందర్భంగా రాష్ట్రంలో క్యాన్సర్ నివారణతో పాటు క్యాన్సర్ చికిత్సను ప్రజలకు చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగుతారని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News