రాముడు కాదు సీత... బీహార్ లో బీజేపీ అస్త్రం !

ఇదిలా ఉంటే సీతామర్హిలోని పునౌరా గ్రామంలోని పునౌరా ధాం ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుని మొదత 2023 సెప్టెంబర్ లో మంజూరు చేశారు.;

Update: 2025-03-14 20:30 GMT

బీజేపీ రాజకీయానికి జోహార్ అనాల్సిందే. ఎప్పటికి ఏది అవసరమో దానికి గురిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేధించడం బీజేపీకి ఎంతో సులువైన విద్య అని ప్రత్యర్ధులు అంటూంటారు. ఎక్కడా ఈ విషయంలో తగ్గేది లేదని బీజేపీ కూడా అనేక సార్లు నిరూపించుకుంటూనే ఉంది.

ఇదిలా ఉంటే యూపీ ఎన్నికలతో పాటు దేశంలో అనేక సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రామాలయాన్ని ట్రంప్ కార్డుగా వాడిన బీజేపీ కేవలం రెండు ఎంపీ సీట్ల నుంచి అయిదు సార్లు అధికారంలోకి వచ్చేలా రాచ బాటలు వేసుకుంది. ఇక ఇపుడు రాముడు కాదు సీత అంటోంది బీజేపీ.

బీహార్ లో శాసనసభకు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ ల మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎన్డీయే కూటమి పట్టుదలగా ఉంది. అయిదేళ్ళ ఎన్డీయే పాలన పట్ల వ్యతిరేకత ఉన్నా అధిగమించాలని చూస్తోంది. మరోసారి బీహార్ గద్దె మీద ఎన్డీయే కూర్చోవడానికి చేయాల్సిన కసరత్తుని చేస్తోంది.

ఈ నేపధ్యంలో బీహార్ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త అస్త్రాన్ని రెడీ చేసి పెట్టింది. బీహార్ లో సీతాదేవి ఆలయం నిర్మాణం అన్నది బీజేపీ అజెండాగా మార్చుకుంటోంది. సీతామర్హి ఆలయాన్ని కాషాయం పార్టీ గట్టిగానే గురి పెట్టింది.

ఈ ఆలయం మిధిలా ప్రాంతంలో ఉంది. అక్కడే సీతాదేవి పుట్టిందని పురాణ గాధలు తెలియచేస్తున్నాయి. ఈ ఆలయ పునరుద్ధరణ మీద బీజేపీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలో సీతామర్హి ఆలయాన్ని పునరుద్ధరించడానికి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేయాలని అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇదిలా ఉంటే సీతామర్హిలోని పునౌరా గ్రామంలోని పునౌరా ధాం ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుని మొదత 2023 సెప్టెంబర్ లో మంజూరు చేశారు. దీనినే సీతామాత జన్మస్థలం అన్నది భక్తుల నమ్మకంగా ఉంది.

ఇపుడు దీనిని అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మార్చాలని అక్కడి ఎన్డీయే ప్రభుత్వం చూస్తోంది. దాంతో బీహార్ లో ఇపుడు సీతా మాత గురించే బీజేపీ మాట్లాడుతోంది. ఆ పార్టీ సీతామాత ఆలయం గురించి చేస్తున్న జపాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న రాజకీయమని కూడా విమర్శిస్తున్నాయి.

మతపరమైన అంశలను బీజేపీ లేవనెత్తుతోందని ఆర్జేడీ మండిపడుతోంది. సీతా ఆలయ ప్రాజెక్ట్ ని అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకుని వస్తున్నారని ఫైర్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన్ రంజన్ గుప్తా ఆరోపిస్తున్నారు.

సరే ఎవరు ఏమనుకున్నా బీజేపీ మాత్రం బీహార్ లో సీతాదేవి ఆలయం విషయంలో ఎక్కువగానే ప్రచారం చేసుకుంటోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ట్రంప్ కార్డు అవుతుందని కూడా భావిస్తోంది. చూడాలి మరి బీహార్ లో బీజేపీని సీతాదేవి ఏ విధంగా అభయహస్తం ఇచ్చి కాపాడుతుందో.

Tags:    

Similar News