వర్మపై నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు?

, వర్మ తనకు ఎమ్మెల్సీ రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ...బయటపడలేదు. ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.;

Update: 2025-03-14 18:40 GMT

జనసేన ఆవిర్భావ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు. అందులో ఒకటి పవన్ కల్యాణ్ అని..రెండో ఫ్యాక్టర్ వ్యక్తి కాదని, ఆ ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పౌరులు, ఓటర్లు అని చెప్పారు. తమలో ఎవరైనా..ఇంకెవరైనా సరే పవన్ విజయానికి తానే దోహదపడ్డాను అని అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి.

ఆ రెండు ఫ్యాక్టర్స్ లేకుంటే తామెంత చేసినా.. ఏం చేసినా ఉపయోగం లేదని చెప్పారు. పిఠాపురం జనసైనికులు, పౌరులకు తాను కృతజ్నత చూపించాలని, అందుకే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నానని అన్నారు. పవన్ తమను పని చేయమన్నారని, పని మొదలుబెట్టాక ఒక విషయం అర్తమైందని చెప్పారు. పవన్ కు ఇక్కడ విజయం ఖరారైందని, పని చేస్తున్నట్లు ఉండడమే తప్ప ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమీ లేదని తనతోపాటు జనసేన నేతలకూ అర్థమైందని అన్నారు.

కాగా, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించినా..సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే, జనసేన వల్లే వర్మకు చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్సీ దక్కలేదని వర్మ వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు. కానీ, వర్మకు ఎమ్మెల్సీ వ్యవహారం చంద్రబాబు చూసుకుంటారని, అది టీడీపీ అంతర్గత వ్యవహారమని జనసేన నేతలు చెప్పారు. దాంతోపాటు, పవన్ కల్యాణ్ లేకుంటే కూటమి లేదని, టీడీపీ గెలుపు సాధ్యం కాదని మంత్రి నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి.

ఇక, వర్మ తనకు ఎమ్మెల్సీ రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ...బయటపడలేదు. ఈ క్రమంలోనే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం నాగబాబు కామెంట్లపై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. మరి, నాగబాబు కామెంట్లపై వర్మ లేదా టీడీపీ నేతలెవరైనా స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News