వైసీపీ శాసనసభా పక్ష నేత ఆయనేనా ?
ఏ రాజకీయ పార్టీకైనా సభా పక్ష నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది సహజమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియ.
ఏ రాజకీయ పార్టీకైనా సభా పక్ష నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది సహజమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియ. ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపించుకుని సభా పక్ష నేతగా ఎన్నుకుంటుంది. ఆ మీదట ఆ లేఖను తీసుకుని గవర్నర్ కి సమర్పిస్తే ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.
ఇక మిగిలిన పక్షాలు తమ పార్టీ నేతలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వారు ఆ వివరాలను స్పీకర్ కి తెలియచేస్తే ఆయన వారిని సభలో ఆయా పార్టీల పక్షాల నేతగా గుర్తిస్తారు. ఇక అసెంబ్లీలో చూస్తే టీడీపీ కూటమి గెలిచింది. అధికారంలో ఉంది.
విపక్షంలో ఏకైక పక్షంగా వైసీపీ ఉంది. వైసీపీ తరఫున ఫ్లోర్ లీడర్ ఎవరు అన్న ప్రశ్న అయితే వస్తోంది. దానిని తెలుగుదేశం పార్టీకి చెందిన వారే లేవనెత్తుతున్నారు. జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణం చేశారు. ఆయన పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
దీంతో వారంతా కలసి కూర్చుని శాసన సభా పక్ష నేతగా జగన్ ని ఎన్నుకోవాలి. ఇది రాజ్యాంగం ప్రకారం పూర్తి చేయాల్సిన లాంచనం. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతవరకూ తమ నాయకుడిని ఎన్నుకోలేదు. దాంతో వైసీపీ పక్ష నేత ఎవరు అని ప్రశ్న ఉదయిస్తోంది.
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తమ పార్టీని ప్రధాన పక్షంగా గుర్తించాలని జగన్ ఆ మధ్యన స్పీకర్ కి లేఖ రాసారు దాని మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అయితే ఇక్కడే టెక్నికల్ పాయింట్స్ ని టీడీపీ నేతలు లేవనెత్తుతున్నారు. జగన్ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ ఎవరు అన్నదే వారి ప్రశ్న. తమ నాయకుడిని ఫలానా వారిని ఎన్నుకున్నామని చెబుతూ వైసీపీ నుంచి ఒక లేఖ స్పీకర్ కి వస్తే ముందు ఫ్లోర్ లీడర్ గా గుర్తిస్తారు అని ఆ మీదట ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
మరి తన పార్టీ వారు ఎన్నుకోనంతవరకూ జగన్ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటారు అని అంటున్నారు. ఇక ఈసారి ఏపీ అసెంబ్లీ ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. వారం పది రోజుల పాటు ఈసారి సమావేశాలు జరగవచ్చు అని అంటున్నారు.
మరి జగన్ సభకు వస్తారా అన్న చర్చ మరో వైపు ఉంది. అలాగే వైసీపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంది. అసెంబ్లీకి హాజరయ్యే ఉద్దేశ్యం లేకపోతే ఫ్లోర్ లీడర్ ఎంపిక కూడా వైసీపీ జరుపుతుందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. తాను కాకపోయినా ఉన్న వారిలో ఎవరో ఒకరికి ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను సభలో ఉండేలా చూడడమే ప్రజా తీర్పుని గౌరవించినట్లుగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు.