ఎన్డీయేకి నో...కాంగ్రెస్ కీ నో... వైసీపీ దారెటు ?

ఏపీలో ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉంది. కేంద్ర సాయం ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండే పార్టీలకు అవసరం.

Update: 2024-05-27 00:30 GMT

ఏపీలో ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉంది. కేంద్ర సాయం ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండే పార్టీలకు అవసరం. అలా అయిదేళ్ళ పాటు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీ మధ్యన తెర వెనక దోస్తీ సాగింది.

అయితే ఎన్నికలు వచ్చి రెండు పార్టీల మధ్య పెద్ద చిచ్చునే రేపాయి అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అంతటితో అది ఆగలేదు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారందరికీ టికెట్లు ఇచ్చింది. పొత్తు పేరుతో టీడీపీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ పోవడానికి పూర్తి సహకారం అందించింది.

ఈ పరిణామాలతో ఈసీ మీద కూడా వైసీపీ గుర్రుగా ఉంది. దాంతో పాటుగా బీజేపీ వైఖరిని ఆ పార్టీ సీనియర్లు అంతా తప్పుపడుతున్నారు. ఎన్నికల సభలలో వైసీపీని తీవ్రంగా విమర్శించడమే కాకుండా అవినీతి ప్రభుత్వం అన్నారు. మరో వైపు చూస్తే ఏపీలో జగన్ అధికారంలో నుంచి దిగిపోతున్నారు అని ప్రధాని మోడీ లాంటి వారు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు.

బీజేపీ గూటి పక్షిగా అంతా ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్ చేత కూడా జగన్ ఓటమి పాలు అవుతున్నారు అని సర్వేలు అంటూ సంచలన ఇంటర్వ్యూలను ఇప్పించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి బీజేపీ తీరు పట్ల మంటగా ఉందని అంటున్నారు.

రేపటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తుందా అంటే డౌట్ అనే అంటున్నారు. 2014 తరువాత బీజేపీతో సానుకూల వైఖరి కనబరుస్తూ వచ్చిన వైసీపీకి ఇపుడు బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యర్ధి పార్టీగానే ఉంది అని అంటున్నారు.

ఎన్నికల్లో ఎన్నో బాధలు ఇబ్బందులకు గురి చేసిన బీజేపీకి మద్దతు ఎందుకు ఇవ్వాలన్న చర్చ వైసీపీలో సాగుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ తో వైసీపీది ఆజన్మ శత్రుత్వం అనే చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. జగన్ ని జైలులో పెట్టించి నానా ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మద్దతు అంటే అది వైసీపీ చివరి ఆప్షన్ గానే చూస్తుంది అని అంటున్నారు.

పైగా తన సొంత కుటుంబంలో చిచ్చు పెట్టి మరీ చెల్లెలుని తెచ్చి ఏపీసీసీ బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా జగన్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. దాంతో ఇండియా కూటమికి మద్దతు కూడా సందేహమే అంటున్నారు. ఇలా జాతీయ స్థాయిలో మోహరించిన రెండు జాతీయ కూటములలో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదన్నది ఈ రోజుకు వైసీపీకి ఉన్న ఆలోచనగా చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోతే మాత్రం భావసారూప్యం కలిగిన పార్టీలతో మూడవ కూటమి దిశగా జగన్ సహా కొందరు నేతలు ఆలోచన చేయవచ్చు అన్నది ప్రచారంలో ఉన్న మాటగా చెబుతున్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కూడా మూడవ కూటమి పాట పాడుతోంది. ఇపుడు వైసీపీ కూడా అదే బాటలో నడవవచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఒడిషాలోని నవీన్ పట్నాయక్, తమిళనాడులోని డీఎంకే స్టాలిన్ పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ వంటి వారిని కలుపుకుంటే వందకు పైగా ఎంపీలతో మూడవ కూటమి జాతీయ స్థాయిలో బలంగా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా అంటున్నారు. అయితే ఈసారి కచ్చితంగా అధికారం మాదే అని చెబుతున్న ఎన్డీయే కూటమికి ఏ రెండు వందల దగ్గరో నంబర్ ఆగిపోతేనే ఈ చర్చ రావచ్చు.

అలాగే ఇండియా కూటమి కూడా మరో రెండు వందల నంబర్ దగ్గర నిలిచి పోతే మాత్రం ఆ మిగిలిన నూటా నలభై మూడు ఎంపీతో మూడవ కూటమి దిశగా ఆలోచనలు జోరందుకుంటాయని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఒకసారి కనుక మూడవ కూటమి అని అడుగులు పడితే ప్రధాని పదవి మీద ఆలోచనలు ఉన్న వారు అంతా ఈ వైపుగా రావచ్చు అని అంటున్నారు. అపుడు ఎన్డీయే ఇండియా కూటములలో ఉన్న పార్టీలు కూడా ఈ వైపు తిరగవచ్చు అని అంటున్నారు. ఈ రకమైన ఆలోచనలకు రూపం రావాలంటే చాలా జరగాల్సి ఉంది. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో న్యూట్రల్ విధానానికే వైసీపీ సిద్ధంగా ఉందని ఈ రోజుకు వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News