కస్టడీ సుదీర్ఘ పొడిగింపు.. సరిగ్గా మరో నెల తిహాడ్ జైల్లోనే కవిత

కాగా, మార్చి 15న కవితను ఢిలీ మద్యం కేసులో ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-03 08:02 GMT

ఇప్పటికే అరెస్టయి.. హైదరాబాద్ నుంచి తరలించి రెండున్నర నెలలు దాటింది.. ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు మరో నెల రోజులు అక్కడే ఉండక తప్పదు. ఢిల్లీ మద్యం కేసులో ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను వచ్చే నెల 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత కస్టడీ ముగియడంతో సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జి షీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కాగా, సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపుపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. అయితే, నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విచారణ జరగనుంది.

కాగా, మార్చి 15న కవితను ఢిలీ మద్యం కేసులో ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్టు చేసింది. కవిత రిమాండ్ మరోసారి పొడిగించాల్సిందిగా ఈడీ, సీబీఐ చేసిన విజ్ఞప్తిని సోమవారం రౌస్ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. అయితే, కవిత కస్టడీని ఏకంగా నెలరోజుల పాటు పొడిగించడం ఇదే తొలిసారి.

మరోవైపు బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత దాదాపు తొలిసారి కవిత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తాను పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పినప్పటికీ కవితకు లోక్ సభ ఎన్నికల సందర్భంగా బెయిల్ దొరకలేదు. వాస్తవానికి కవిత 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. 2019లో ఆమె బీజేపీ అభ్యర్థి ధర్మిపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగేది, దిగనది నిర్ధారణ కాక ముందే.. ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందే కవిత అరెస్టయ్యారు.

ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగిసింది. దీనితో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నీతీష్ రాణా వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. కవిత కస్టడీ మరి కొంతకాలం పొడిగించాలని, తమ రిమాండ్‌ కు తరలించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. కవిత ప్రమేయం నిర్ధారించామని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని వివరించారు.

ఢిల్లీ మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News