అమెరికాలో మరో దారుణం.. ఈసారి 17 ఏళ్ల భారతీయ అమ్మాయి!

అమెరికాలో భారతీయులపై కేవలం దాడులు, హత్యలు మాత్రమే కాకుండా కిడ్నాప్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి

Update: 2024-04-10 04:49 GMT

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఒక భారతీయ విద్యార్థిని స్టోర్‌ లో ఆశ్రయం అడిగిన ఒక దేశదిమ్మరి కొట్టిచంపాడు. అలాగే మరో భారతీయ విద్యార్థిని అతడు చదువుతున్న యూనివర్సిటీలోనే కొట్టి చంపేశారు.

అమెరికాలో భారతీయులపై కేవలం దాడులు, హత్యలు మాత్రమే కాకుండా కిడ్నాప్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇంటి నుంచి బయటకెళ్లిన 17 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఏప్రిల్‌ 8వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన 17 ఏళ్ల ఇషికా ఠాకూర్‌ ఆ తర్వాత ఇంటికి చేరలేదు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతుకులాట సాగిస్తున్నారు.

ఇషికా చివరిసారిగా ఏప్రిల్‌ 8వ తేదీ సోమవారం రాత్రి 11:30 గంటలకు టెక్సాస్‌ లోని ఫ్రిస్కోలో కనిపించిందని చెబుతున్నారు. ఆ సమయంలో ఆమె నలుపు పొడుగు చేతుల చొక్కా, ఎరుపు/ఆకుపచ్చ పైజామా ప్యాంటు ధరించి బ్రౌన్‌ వుడ్‌ డ్రైవ్‌ లో తన ఇంటి నుండి బయలుదేరిందని సమాచారం. ఆమె ఎత్తు 5 అడుగుల నాలుగు అంగుళాలు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇటీవల అమెరికాలో భారతీయ అమెరికన్లు అదృశ్యమైన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం భారతదేశానికి చెందిన 25 ఏళ్ల మహ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ అనే విద్యార్థి క్లీవ్‌ ల్యాండ్‌ లో అదృశ్యమై.. ఆ తర్వాత శవమై కనిపించిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉన్న పర్డ్యూ యూనివర్శిటీలో నీల్‌ ఆచార్య అనే విద్యార్థి కూడా మొదట కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత శవమై కనిపించాడు.

అలాగే గతేడాది టెక్సాస్‌ లో 25 ఏళ్ల భారతీయ–అమెరికన్‌ మహిళ అదృశ్యమయ్యింది. ఓక్లహోమాలో ఆమె శవం కనిపించింది.

ఈ నేపథ్యంలో తాజాగా అదృశ్యమయిన 17 ఏళ్ల ఇషికా ఠాకూర్‌ కు ఏమీ కాకూడదని, ఆమె క్షేమంగా తిరిగి రావాలని అమెరికన్‌ భారతీయులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News