12 ఏళ్ల తర్వాత అయేషా బాడీకి రీపోస్టుమార్టం

Update: 2019-07-14 06:56 GMT
అయేషా మీరా.. రాష్ట్రంలోనే అంతుచిక్కని ఈ ఫార్మసీ విద్యార్థి హత్య వెనుక ఎవరున్నారన్నది ఇప్పటివరకు తేలింది లేదు.  12 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్యలో ఓ సీనియర్ నేత - నాటి మంత్రి మనవడు ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ తర్వాత ఒక వ్యక్తిని నిందితుడుగా చూపించి జైల్లో పెట్టగా హైకోర్టు అతడు నిరుపరాధి అని వదిలేసింది. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది.

చంద్రబాబు హయాంలో ఈ కేసును సీబీఐకి బదలాయించారు. వారు ఇప్పుడు ఈ కేసును తవ్వితీసే పనిలో పడ్డారు. ఇందుకోసం మొదటి నుంచి విచారణ మొదలు పెడుతున్నారు. అయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ - ఇక్బాల్ భాషాల డీఎన్ఏలను మే 30న సేకరించారు. ఇక అయేషా మీరాపై ఉన్న గాయాల ఆధారాలను అస్తిపంజరం నుంచి తెలుసుకోవచ్చునని ఫోరెన్సిక్ నిపుణుల సూచనలతో ఆమె సమాధిని తవ్వి రీపోస్టుమార్టం చేసి డీఎన్ఏను తీసుకొని పోల్చి చూడాలని సీబీఐ నిర్ణయించినట్టు సమాచారం.

కాగా అయేషా ముస్లిం కావడం.. ఆమె సమాధిని 12 ఏళ్ల క్రితం పూడ్చడంతో ఆమె సమాధిని తీయడానికి ముస్లిం మతపెద్దలు ఒప్పుకోలేదట.. దీంతో సీబీఐ హైకోర్టుకెళ్లి పోలీసుల సాయంతో సమాధిని తవ్వి డీఎన్ ఏ - రీపోస్టుమార్టంకు ప్రయత్నించాలని నిర్ణయించిందట..

తాజాగా సీబీఐ ఇలా క్షేత్రస్థాయిలో అయేషా హత్యకేసును చేధించడంపై అయేషా మీరా తల్లి శంషాద్ హర్షం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు తమకు న్యాయవ్యవస్థపై, సీబీఐపై ఆశలు కల్పిస్తోందని వివరించింది. మత సంప్రదాయాలు ఒప్పుకోకున్నా కేసు తేలాలనే తమ కూతురు మృతదేహానికి రీపోస్టుమార్టంకు ఒప్పుకున్నామన్నారు.  పూర్తిగా సీబీఐకి సహకరిస్తామని తెలిపింది.


Tags:    

Similar News