ఆ కార్చిచ్చులో అధ్యక్షుడి కుమారుడి ఇల్లూ బూడిద

తాజాగా లాస్ ఏంజెలస్ కార్చిచ్చులో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం సైతం కాలి బూడిదైంది.

Update: 2025-01-09 10:54 GMT

అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టే నేచర్ డిజాస్టర్స్ లో తుఫాన్లు, కార్చిచ్చు ప్రధానమైనవి. దాదాపు 20 నెలల కిందట అమెరికా, కెనడాలను కార్చిచ్చు చుట్టుముట్టింది. నెలల తరబడి మంటలు అదుపులోకి రాలేదు. పెద్ద దేశాలు కావడం, జనాభా తక్కువగా ఉండడం, అటవీ విస్తీర్ణం అధికంగా ఉండడం తదితర కారణాలు దీని వెనుక ఉన్నాయి. కాగా, తాజాగా అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు బారిన పడింది.

నిప్పు ముందు ఎంతటి వారైనా..

అగ్గి రాజుకుంటే అంతా బుగ్గే.. దానికి ఎవరైనా ఒకటే. ఇప్పుడు లాస్ ఏంజెలెస్ లో అదే జరుగుతోంది. చుట్టుముట్టిన కార్చిచ్చు నుంచి బయటకు రావడం ఎలాగో తెలియడం లేదు. వేలాది ఎకరాల్లోని చెట్లు, విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే హాలీవుడ్ సినీ పరిశ్రమనూ సెగలు తాకుతున్నాయి.

హంటర్ ఇల్లు చిక్కింది

మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు జో బైడెన్. జనవరి 20న ఆయన స్థానంలో ట్రంప్ అధ్యక్షుడిగా రానున్నారు. తాజాగా లాస్ ఏంజెలస్ కార్చిచ్చులో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం సైతం కాలి బూడిదైంది. ఈయన నివాసం మాలిబులో ఉంది. ఇక్కడ మంటల తీవ్రత ఎంతగా ఉందంటే.. హంటర్ బైడెన్ ఇంటి ఎదుట నిలిపిన కారు సైతం కాలిపోయిందట.

అయితే, బైడెన్ కు మాత్రం కుమారుడి నివాసం దగ్ధం అయిన సంగతి తెలియదట. ఈ విషయం ఆయన విలేకరుల ముందు అంగీకరించారు.

75 ఏళ్ల నివాసం

హంటర్ బైడెన్ ఉంటున్న ఇల్లు 1950లో నిర్మించారట. 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇల్లు మూడు గడులతో విలాసవంతంగా ఉంటుందట. కాగా, కార్చిచ్చు గురువారం హాలీవుడ్ హిల్స్‌ కూ తాకిందనే కథనాలు వస్తున్నాయి. 2 వేల నిర్మాణాలు కాలిపోయినట్లు చెబుతున్నారు. ఐదుగురు చనిపోయారు. ఆరుచోట్ల కార్చిచ్చులు వ్యాపించాయని గుర్తించారు. రూ.4.2 లక్షల కోట్లు (50 బిలియన్‌ డాలర్లు) నష్టం వాటిలినట్లు సమాచారం.

Tags:    

Similar News