పవన్ నాగబాబు ఊహల్లో ఉన్నారా ?
ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో తమకు తిరుగులేదని అనుకుంటోంది. అంతే కాదు ఏపీలో ఓల్డెస్ట్ ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని కూడా తామే అండగా దండగా ఉండి నడిపించామని అంటోంది.;
రాజకీయాలు అంటే ఎన్నో లెక్కలు చిక్కులు ఉంటాయి. రాజకీయాలను ఔపాసన పట్టేశామని అనుకున్న వారు సైతం దిమ్మతిరిగిపోయేలా ఫలితాలు వస్తూంటాయి. విజయం అన్నది ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. అతి ధీమాను పెంచేస్తుంది. అయితే దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి తప్పించి వేరేగా ఆలోచించరాదు.
ఇక జనసేన విషయానికి వస్తే ఏపీలో తమకు తిరుగులేదని అనుకుంటోంది. అంతే కాదు ఏపీలో ఓల్డెస్ట్ ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని కూడా తామే అండగా దండగా ఉండి నడిపించామని అంటోంది. నిజంగా ఇది నిజమేనా అన్నదే ఇపుడు చర్చ. పవన్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు కానీ అలాగే నాగబాబు చేసిన ప్రసంగంలో విషయాలు కానీ చూస్తే కనుక జనసేన ఇంకా ఊహలలో ఊగిసలాడుతోందా అన్నది అయితే చర్చకు వస్తోంది.
నాలుగు దశాబ్దాల టీడీపీని మేమే నిలబెట్టామని పవన్ అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నదే రాజకీయంగా ఎవరికీ అర్ధం కాని విషయంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఎంతో చరిత కలిగిన పార్టీ. అంతే కాదు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న పార్టీ. ఆ పార్టీని నిలబెట్టామని పవన్ చేసిన ప్రకటన అయితే ఇపుడు హాట్ టాపిక్ గానే ఉంది మరి.
ఇక జనసేన విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ పోటీ చేస్తే రెండు సీట్లలోనూ ఆయన ఓటమి పాలు అయ్యారు. అంతే కాదు అదే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా ఓటమి పాలు అయ్యారు. ఆ విధంగా చూస్తే ఒంటరిగా జనసేన పోటీ చేస్తే ఎక్కడా గెలిచే పరిస్థితి అయితే లేదని అంటున్నారు.
ఇక 2023 సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్టు తరువాత జనసేనను టీడీపీ వారు ఏమీ మీ సానుభూతి కావాలి మద్దతు కావాలి అని ఎక్కడా కోరలేదని అంటున్నారు. పవన్ జైలుకు వెళ్ళి చంద్రబాబుని పరామర్శించారు. తానుగానే టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారని అంటున్నారు.
అదే సమయంలో జనసేనకు టీడీపీ 21 అసెంబ్లీ సీట్లను రెండు ఎంపీ సీట్లను పొత్తులో భాగంగా ఇచ్చింది. జనసేన రాజకీయ ప్రదర్శన ఏమిటి అన్నది చూసిన మీదటనే ఈ సీట్లు ఇచ్చారని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ ఆ పార్టీ ఓటింగ్ పెర్సంటేజ్ ఎపుడూ 45 శాతానికి తగ్గకుండా ఉంటే జనసేనకు 6 శాతం మాత్రమే ఓటింగ్ షేర్ ఉంది.
ఈ రెండు పార్టీలు కలిస్తే జనసేనకు ఎంతో రాజకీయ లాభంగా మారింది అన్నది గణాంకాలు తెలియచేస్తున్నాయని అంటున్నారు. జనసేన కేవలం ఆరేడు శాతం ఓట్లతో 21 అసెంబ్లీ అలాగే రెండు ఎంపీ సీట్లను భారీ మెజారిటీతో గెలుచుకుందని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. టీడీపీ ఓట్లు పెద్ద ఎత్తున ట్రాన్సఫర్ కావడం వల్లనే ఇదంతా జరిగింది అని అంటున్నారు.
ఇక టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. బూత్ లెవెల్ నుంచి పార్టీ ఉంది. జనసేన టీడీపీని వీడితే సొంతంగా గెలిచే అవకాశం ఉందా అన్నదే చర్చగా ఉంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలిచేందుకు వీలు అవుతుందా అన్నది కూడా టీడీపీ శ్రేణుల మాటగా ఉంది.
నిజానికి చూస్తే ఏపీలో టీడీపీ అతి పెద్ద పార్టీ. కోటికి పైగా సభ్యత్వం కలిగిన పార్టీ. ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. అటువంటి టీడీపీని మేము నిలబెట్టామని పవన్ అంటున్నారు. పవన్ చరిష్మాతో గెలిచామని నాగబాబు అంటున్నారు.
ఇంతకు రెండు రోజుల ముందు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చినా చంద్రబాబు సీఎం అయినా అంతా పవన్ దయ అని అంటున్నారు. మరి ఇది నిజంగా రాజకీయ గణితానికి అతుకుతుందా లేదా అతి ఉత్సాహంతో చేస్తున్న ప్రకటనలా అంటే రెండవదే కరెక్ట్ అన్నది టీడీపీ శ్రేణుల మాటలుగా ఉన్నాయి. రాజకీయాల్లో ఎన్నో ఫ్యాక్టర్లు ఉంటాయి. వాటిని చూడాలి తప్పించి వేరే విధంగా అన్వయించుకుంటే ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.