అమర సైనికుల శవాలకూ అవమానం.. పాకిస్థాన్ లో ఇదీ పరిస్థితి
‘ప్రతి దేశానికీ ఒక సైన్యం ఉంటుంది.. కానీ, సైన్యానికే ఒక దేశం ఉంది.. అది పాకిస్థాన్..’’ వినడానికి సెటైర్ లా ఉన్నా ఇది పచ్చి నిజం.;

‘ప్రతి దేశానికీ ఒక సైన్యం ఉంటుంది.. కానీ, సైన్యానికే ఒక దేశం ఉంది.. అది పాకిస్థాన్..’’ వినడానికి సెటైర్ లా ఉన్నా ఇది పచ్చి నిజం. భారత్ నుంచి విడిపోయి.. బ్రిటిష్ వారి నుంచి మనకంటే ఒక్క రోజు ముందు స్వాతంత్ర్యం పొందిన పాకిస్థాన్ లో 77 ఏళ్లలో అత్యధిక కాలం పాలించినది సైన్యమే అనేది చరిత్ర స్పష్టంగా చెబుతుంది. మన కళ్లముందటి ఉదాహరణలు చూసినా.. నవాజ్ షరీఫ్ నుంచి మేటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ సైన్యం ఆగ్రహానికి గురై ప్రధాని పదవులు పోగొట్టుకున్నవారే.
మరి సైన్యం ఇంత కీలక పాత్ర పోషిస్తున్న పాకిస్థాన్ లో ఆ సైనికులు ప్రాణాలు కోల్పోతే అమరుల కింద సరైన గౌరవం దక్కుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. వాస్తవానికి దేశం ఏదైనా అమర సైనికుల త్యాగాలను గుర్తించడం ధర్మం. వారు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు కాబట్టి ఘనంగా స్మరించుకోవడం న్యాయం. కానీ, పాకిస్థాన్ కదా..? అదేమీ ఉండదని మరోసారి తేలింది.
1999లో ఉగ్రవాదుల ముసుగున కార్గిల్ లోకి తమ సైన్యాన్ని పంపి చావుదెబ్బ తిన్నది పాకిస్థాన్. చనిపోయినవారిని తమ సైనికులుగా గుర్తించలేని దౌర్భాగ్యపు పరిస్థితిని ఎదుర్కొంది. వారు కార్గిల్ స్థానిక గిరిజనులంటూ అప్పట్లో అబద్ధాలు ఆడింది. తర్వాత తప్పు ఒప్పుకొంది.
తాజాగా బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చేతుల్లో చనిపోయిన సైనికుల సంఖ్య విషయంలోనూ దాగుడుమూతలు ఆడుతోంది. రైలు హైజాక్ ఘటనలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని పాక్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోగా.. బీఎల్ఏ మాత్రం 214 మందిని చంపేశామంటూ సంచలన ప్రకటన చేసింది.
అసలు నిజం ఏమిటో ఎవరికీ తెలియదని భావించిన పాక్.. 200 శవ పేటికలను గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసింది. అంతే తప్ప పోరాడలేదని స్పష్టం అవుతోంది. పెద్దఎత్తున తమ సైనికులు చనిపోయారని పరోక్షంగా అంగీకరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే జవాన్ల ప్రాణాలను గాలికొదిలేసిందని అర్థం అవుతోంది. జవాన్ల శవపేటికల వీడియోలు ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.