పవన్ ‘సనాతనం’పై బ్రహ్మానందం క్లాసు!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెప్పే ‘సనాతన ధర్మం’పై రాజకీయ ప్రత్యర్జలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.;
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెప్పే ‘సనాతన ధర్మం’పై రాజకీయ ప్రత్యర్జలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా జనసేన ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన జయకేతనం సభ తర్వాత పవన్ టార్గెట్ గా విపక్షాలు బాణాలు ఎక్కుపెడుతున్నాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న వారు పవన్ ఈ విషయంలో చాలా నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. సనాతనంపై ప్రముఖ హాస్యనటుడు బ్రాహ్మానందం చెప్పిన విషయాలను పవన్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
జయకేతనం సభలో పవన్ తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు చేసిన ప్రసంగాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా పవన్ చేసిన సనాతన ధర్మం, హిందీ భాషపై కామెంట్స్ తోపాటు పిఠాపురంలో ఎవరి సహకారం లేకుండానే పవన్ గెలిచారంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. పవన్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు ఎక్కుపెట్టగా, నాగబాబును టీడీపీ సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై సీపీఐ కూడా గళం విప్పింది.
జయకేతనం సభలో పవన్ ప్రసంగం మొత్తం బీజేపీ స్క్రిప్టు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఆరోపించారు. జనసేన అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ రాసిచ్చిన స్క్రిప్టును చదవడం ఏంటంటూ రామక్రిష్ణ వ్యంగ్యస్త్రం సంధించారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దకూడదంటూ దక్షిణాది పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. పవన్ మాత్రం హిందీ కావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. త్రిభాషా విధానాన్ని దక్షిణాది పార్టీలేవీ వ్యతిరేకించడం లేదని, హిందీని బలవంతంగా రుద్దకూడదనే తమ డిమాండ్ అని చెప్పారు. తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ ప్రశ్నించడాన్ని రామక్రిష్ణ తప్పుబట్టారు. హిందీకి బదులుగా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏదైనా ఒకదాన్ని నేర్చుకోమని చెప్పొచ్చు కదా? అంటూ నిలదీశారు.
ఇక పవన్ పదేపదే సనాతన ధర్మం అంటున్నారని, కాషాయం కప్పుకుని, పెద్దపెద్ద బొట్లు పెట్టుకుని బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ లా ఆయన వ్యవహరిస్తున్నారని రామక్రిష్ణ మండిపడ్డారు. సతీ సహగమనం, శూద్రుల చదువుకోకూడదు, అంటరానితనం వంటి దురాచారాలను ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. సనాతన ధర్మం వల్ల కలిగే నష్టాలపై తాము చెబితే పవన్ వినరని, అందుకే ప్రముఖ హాస్యనటుడు బ్రాహ్మానందం దగ్గర పవన్ నేర్చుకోవాలని సూచించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఓ సభలో సనాతనంపై బ్రాహ్మానందం చక్కగా వివరించారని గుర్తు చేశారు. పవన్ మారాలంటే ఆయనతో క్లాసులు ఇప్పించాలని అభిప్రాయపడ్డారు.