బీసీసీఐ నుంచి ధోని పెన్షన్.. నెలకు ఎంతో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది.;

Update: 2025-03-16 07:54 GMT

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన ధోనీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్నాడు. గత సీజన్ నుంచి సాధారణ ఆటగాడిగానే ఆడుతున్న ధోనీ, కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. అందుకే చెన్నై అభిమానులు అతడిని 'తలా' అని పిలుచుకుంటారు. 17 ఏళ్ల అనుబంధంతో చెన్నై జట్టు అతడిని మెగా వేలంలో నిలుపుకుంది. గత సీజన్‌లో ధోనీ పెద్దగా రాణించకపోయినా, చెన్నై యాజమాన్యం అతడిని జట్టులో కొనసాగిస్తోంది.

ధోనీకి ఆర్థికంగా ఎలాంటి లోటు లేనప్పటికీ, బీసీసీఐ అతడికి నెలవారీ పెన్షన్ అందిస్తోంది. ధోనీ నాయకత్వంలో భారత జట్టు 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. 2022లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఆటగాళ్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో ఆటగాళ్ల పెన్షన్ మొత్తం పెరిగింది. ఈ పథకం పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది.

ఆటగాళ్ల క్రీడా జీవితాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ణయిస్తారు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీని ప్రకారం అతడికి బీసీసీఐ నుంచి నెలకు రూ. 70,000 వరకు పెన్షన్ వస్తుంది. ధోనీ ఈ పెన్షన్‌ను స్వీకరిస్తూనే, దానిని ఛారిటీ కార్యక్రమాలకు ఉపయోగిస్తాడని తెలుస్తోంది. పెద్దగా ప్రచారం కోరుకోని ధోనీ, తన ఛారిటీ కార్యక్రమాల గురించి గోప్యంగా ఉంచుతాడు. తన స్వస్థలమైన జార్ఖండ్‌లో పేద పిల్లలు, రైతులకు సహాయం చేస్తాడు. ధోనీ మొదటి నుండి ప్రచారానికి దూరంగా ఉంటాడు. ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని విద్యార్థుల చదువు కోసం, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు కేటాయిస్తాడు.

బీసీసీఐ పెన్షన్ పథకం

బీసీసీఐ మాజీ క్రికెటర్లకు వారి సేవలను గుర్తించి పెన్షన్ అందిస్తుంది. ఆటగాడు ఆడిన మ్యాచులు, చేసిన సేవలను బట్టి పెన్షన్ మొత్తం నిర్ణయిస్తారు. ఈ పథకం ద్వారా మాజీ క్రికెటర్లకు ఆర్థిక భద్రత కల్పించడం బీసీసీఐ లక్ష్యం.

- ప్రముఖ క్రికెటర్ల పెన్షన్ వివరాలు

వినోద్ కాంబ్లి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ మాజీ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం బీసీసీఐ నుంచి రూ.30,000 పెన్షన్ పొందుతున్నారు.

సచిన్ టెండూల్కర్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు నెలకు రూ.70,000 పెన్షన్ అందుతోంది.

యువరాజ్ సింగ్: సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కు నెలకు రూ.60,000 పెన్షన్ లభిస్తోంది.

సునీల్ గవాస్కర్: భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ నెలకు రూ.70,000 పెన్షన్ అందుకుంటున్నారు.

మహేంద్ర సింగ్ ధోని: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 పెన్షన్ అందుకుంటున్నాడు.

పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు?

టీమిండియాకు ఎన్ని మ్యాచులు ఆడాడు అనేదాన్ని బట్టి మాజీ క్రికెటర్లకు పెన్షన్ అందిస్తారు. ఉదాహరణకు కనీసం 25-49 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వారికి రూ. 60 వేలు, 75 అంతకంటే ఎక్కువ టెస్ట్‌లు.. లేదా 50 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడి, భారత క్రికెట్‌కు అద్భుత విజయాలు అందించడంలో సహపడిన క్రికెటర్లకు రూ. 70 వేలు లభిస్తాయి

Tags:    

Similar News