పవన్ అన్న గ్లాసు లేదా? లోకేశ్ కామెంట్స్ వైరల్
మంత్రి నారా లోకేశ్ జనసేన గుర్తు గాజు గ్లాసుపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.;
మంత్రి నారా లోకేశ్ జనసేన గుర్తు గాజు గ్లాసుపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మా పవన్ అన్న గ్లాసు ఉండాలి కదా అంటూ లోకేశ్ వ్యాఖ్యానించడం నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం మంగళగిరిలో లోకేశ్ పర్యటించారు. తన సొంత నియోజకవర్గంలో స్వయంగా చెత్త తీయడంతోపాటు స్థానికంగా పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందితో ఓ టీ స్టాల్ వద్ద ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
మంగళగిరి ఏకో పార్కును శుభ్రం చేసిన అనంతరం పారిశుధ్య సిబ్బందితో భేటీ అయిన లోకేశ్, వారితో కలిసి టీ తాగారు. ఓ కార్మికురాలు మంత్రి లోకేశ్ తోపాటు అక్కడ ఉన్నవారికి టీ అందజేశారు. అయితే గ్లాసుతో టీ తెచ్చిన కార్మికురాలిని ఉద్దేశించి.. ఏమ్మా మా పవన్ అన్న గ్లాసు లేదా? అంటూ ప్రశ్నించారు. హ్యాండిల్ ఉన్న గ్లాసుతో టీ తేవడాన్ని గమనించిన లోకేశ్.. జనసేన ఎన్నికల గుర్తు హ్యాండిల్ లేని గ్లాసులో ఇవ్వాల్సింది కదా? అంటూ అడిగారు. దీంతో అక్కడ ఉన్నవారు కాసేపు హాయిగా నవ్వుకున్నారు.
పిఠాపురంలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో నాగబాబు వ్యాఖ్యలుపై టీడీపీ సోషల్ మీడియా రగిలిపోతుండగా, ఆ వాతావరణాన్ని తేలిక పరిచేలా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. పిఠాపురం సభలో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, పవన్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను అభినందనలతో ముంచెత్తారు. దీంతో పవన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చాటేందుకు లోకేశ్ ఫన్నీ కామెంట్స్ చేశారంటున్నారు. మా పవన్ అన్న గ్లాసు అంటూ జనసేన గుర్తును లోకేశ్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
ఇక పారిశుధ్య కార్మికులతో పిచ్చాపాటిగా మాట్లాడిన లోకేశ్ వారితో పారిశుధ్య పరిరక్షణపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సులాభ్ కాంప్లెక్స్ ల నిర్వహణతోపాటు ప్లాస్టక్ నిషేధం, మురుగు కాలువల శుద్ధి ఇలా పరిశుభ్రత కార్యక్రమాలపై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. వారి జీతాల కోసం ఎదురవుతున్న సమస్యలను విని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.