కమల్ హాసన్ ను మించిన నటుడు బాలినేని!

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనసేన ప్లీనరీలో మాజీ సీఎం జగన్ పై బాలినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.;

Update: 2025-03-16 07:35 GMT

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనసేన ప్లీనరీలో మాజీ సీఎం జగన్ పై బాలినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ తన ఆస్తులతోపాటు తన వియ్యంకుడి ఆస్తులను కాజేశారని బాలినేని ఆరోపించారు. అంతేకాకుండా భవిష్యత్తులో జగన్ సీఎం కాలేరంటూ జోస్యం చెప్పారు. బాలినేనీ ఈ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్ గా స్పందించింది. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ బాలినేని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కమల్ హాసన్ ను మించిన నటుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని, ఆయన మాటలను ప్రకాశం జిల్లాలో ఎవరూ విశ్వసించరని ధ్వజమెత్తారు.

బాలినేని వ్యాఖ్యలను ఖండించేందుకు ఎమ్మెల్యే బూచేపల్లి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘బాలినేని నీ గురించి అందికీ తెలుసు. జిల్లాలో ప్రతి ఒక్కరినీ వేధించి ఆస్తులు దోచుకున్నావ్. నీ బాధితుడు కాని వారు జిల్లాలో ఒక్కడు కూడా లేరు. నువ్వు పార్టీ మారిన తర్వాత వైసీపీ బాగుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వు జడ్పీ చైర్మన్ ను మార్చేస్తాను అంటున్నావ్.

నీలాగా అవకాశవాదులు ఎవరూ జడ్పీటీసీలుగా లేరు. అంతా పార్టీ కోసం పనిచేసిన వారే ఉన్నారు. ప్రకాశం జడ్పీ చైర్మన్ ను నువ్వు ఏమీ చేయలేవు. ఒకటే గుర్తు పెట్టుకోండి. బాలినేని అవకాశవాది. తన రాజకీయాల కోసం ఎమ్మెల్సీ అవుతాను, మంత్రిని అవుతాను అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. అయ్యా పవన్ కల్యాణ్ గారు ఒక్క విషయం గుర్తించుకోండి. బాలినేని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమైపోతుంది’’ అంటూ బూచేపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నటనలో బాలినేని సినీ నటుడు కమల్ హాసన్ ను మించిపోయారంటూ బూచేపల్లి వ్యాఖ్యానించారు. ఆయనతో ఓ పెద్ద సినిమా తీయొచ్చన్నారు. టీడీపీలో చేరేందుకు బాలినేని ప్రయత్నిస్తే ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారని, చివరికి ఆస్తులు కాపాడుకోడానికి జనసేనలో చేరారరంటూ ఆరోపించారు. బాలినేనిలా అమ్ముడుపోయే నేతలు ఎవరూ వైసీపీలో లేరని అన్నారు. కాగా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రకాశం జిల్లా పరిషత్ పీఠం నుంచి చైర్ పర్సన్ వెంకాయమ్మను దించేయాలని చాలా కాలంగా ప్లాన్ జరుగుతోంది. తొలుత జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ దిశగా ప్రయత్నాలు చేసినా, జడ్పీటీసీల్లో చాలా మంది పార్టీ మారే విషయంలో సానుకూలంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే జడ్పీటీసీల్లో ఎక్కువ మంది బాలినేని అనుచరులు ఉన్నారని చెబుతున్నారు. వీరంతా పార్టీ మారితే వైసీపీని జడ్పీ పీఠం నుంచి ఖాళీ చేయించొచ్చని భావిస్తున్నారు. దీంతో బాలినేని రాజకీయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే బూచేపల్లి అలర్ట్ అయ్యారని అంటున్నారు.

Tags:    

Similar News