బీజేపీలోకి వైసీపీ కీలక నేతలు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న నేతలు కూటమి పార్టీలతో టచ్ లోకి వెళుతున్నట్లు ప్రచారం ఎక్కువవుతోంది.;
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న నేతలు కూటమి పార్టీలతో టచ్ లోకి వెళుతున్నట్లు ప్రచారం ఎక్కువవుతోంది. ముఖ్యంగా జనసేన, బీజేపీల్లో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. టీడీపీ అంటే గిట్టని నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన, బీజేపీలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు జనసేనలో చేరగా, బీజేపీ కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవడంతో పాటు తమ ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కమలం పెద్దలు వైసీపీని వీడే నేతలు ఇకపై బీజేపీలో చేరేలా చూడాలని రాష్ట్ర పార్టీకి ఆదేశించినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ బలం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ. విశాఖ డెయిరీకి ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బ్రాంచిలు ఉన్నాయి. లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక విశాఖ డెయిరీలో అడారి కుటుంబం ఆధిపత్యం నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అడారి ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి చేరువకావాలని ప్లాన్ చేసింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితరులను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ ఇద్దరు కాకుండా విశాఖ నగరంలోని ఓ మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విద్యాసంస్థలు ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తొలుత టీడీపీలో ఉండేవారు. గత ప్రభుత్వంలో తన విద్యాసంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అలా వెళ్లిన సదరు నేత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీలో తలుపులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వ్యవహారాలతో బాగా సంబంధాలు ఉన్న మరో వైసీపీ మాజీ నేత కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు రాజ్యసభ అవకాశమిస్తే పార్టీని రాష్ట్రంలో ఆర్థికంగా కూడా నిలబెడతానని ఆ నేత హామీ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తనను చేర్చుకున్న తర్వాత వైసీపీ నుంచి కీలకమైన నేతలను పార్టీలోకి తీసుకువస్తానని, 2029 నాటికి ఆ పార్టీని ఖాళీ చేస్తానని కూడా ఆ నేత బీజేపీ పెద్దలకు హామీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.