ఉగ్రవాదులకు భద్రత పెంచిన పాక్... వణుకుతోన్న లష్కరే తోయిబా చీఫ్!
లష్కరే తోయిబాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖతాల్ ను శనివారం గుర్తు తెలియని గన్ మెన్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.;
లష్కరే తోయిబాలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖతాల్ ను శనివారం గుర్తు తెలియని గన్ మెన్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అతడిపై సుమారు 20 రౌండ్ల వరకూ కాల్పులు జరిపారు. దీంతో.. అబు ఖతాల్ తో పాటు అతడి సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. గత ఏడాది రియాసీలో టూరిస్ట్ బస్సుపై దాడి కేసులో ఇతడు ప్రధాన సూత్రధారి.
ఈ నేపథ్యంలో.. ఆ ఘటన జరిగి ఏడాది తిరక్కముందే అబు ఖతాల్ ను కాల్చి చంపేశారు. ఇలా ఖతల్ మరణంతో లష్కరే తోయిబా కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. దీంతో.. అతడికి పాక్ భద్రత పెంచింది.
అవును... ఇటీవల అబు ఖతాల్ ను గుర్తుతెలియని గన్ మెన్లు కాల్చి చంపిన నేపథ్యంలో.. లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కు భద్రత గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. అతడి సెక్యూరిటీని పాక్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. సమీక్షించింది.
మరోపక్క హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కు సెక్యూరిటీని పెంచినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హఫీజ్ సయీద్ పై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... 2021లో అతడి ఇంటివద్ద భారీ పేలుడు చోటు చేసుకోగా.. అందులో అతడు తృటిలో తప్పించుకున్నాడు. అప్పటినుంచి భయపడుతున్నాడని అంటున్నారు!
దానికి తోడు 2023లో ఇద్దరు టాప్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు అయినా రియాజ్ అహ్మద్, హంజ్లా అదన్నాన్ లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక డిసెంబర్ 2024లో జరిగిన దాడిలో నెంబర్ టు స్థానంలో ఉన్న అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి చెందాడు. ఇలా తన వారిపై వరుస దాడులు జరుగుతుండటంతో.. హఫీజ్ లో వణుకు మొదలైందని అంటున్నారు.
అందువల్లే అబ్దుల్ రెహ్మాన్ మక్కీ అంతిమయాత్రలో కూడా పాల్గొనే ధైర్యం చేయలేకపోయాడు హఫీజ్. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న హఫీజ్ తో పాటు బయట ఉన్న అతడి కుమారుడుకి పాకిస్థాన్ ప్రభుత్వం సెక్యూరిటీని పెంచిందని అంటున్నారు.