అమరావతికి అప్పు కాదు భారీ గ్రాంట్ ఇస్తారా ?
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మరోసారి దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వస్తున్నారు.;
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మరోసారి దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఏప్రిల్ 15న ఏకంగా 47 వేల కోట్ల అమరావతి రాజధాని పనులకు శ్రీకారం చుడతారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన బుధవారం ప్రధానితో భేటీ అయి అమరావతి రాజధాని సహా అనేక విషయాలు చర్చిస్తారు అని అంటున్నారు. అమరావతి రాజధాని అన్నది ఏపీ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీగా ఉంది.
దాంతో ఈ విషయం మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఇక అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియన్ బ్యాంక్ హడ్కో నుంచి పెద్ద ఎత్తున రుణాలు అయితే వస్తున్నాయి. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ లో ఆరేడు వేల కోట్ల రూపాయలు దాకా కేటాయించింది. వీటితో అమరావతి రాజధాని పనులు వేగంగా మొదలవుతాయని అంటున్నారు.
ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుని అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చురుకుగా అడుగులు వేస్తోంది. 2028 నాటికి తొలి దశను పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉంది. అయితే అమరావతి రాజధానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఇప్పటికి పదేళ్ళ క్రితం 2015 అక్టోబర్ 22న వచ్చారు. శంకుస్థాపన చేశారు.
ఆ రోజున విజయదశమి కూడా. దాంతో విజయవంతంగా రాజధాని పూర్తి అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ పెద్దగా ఏమీ కాకుండానే 2019లో టీడీపీ గద్దె దిగాల్సి వచ్చింది. ఇక అమరావతి రాజధాని విషయంలో టీడీపీ బిగ్ కాన్వాస్ మీద డిజైన్లు వేస్తోంది. అది లక్షల కోట్ల వ్యవహారంగా ఉంది అని అంటున్నారు.
కేంద్రం అయితే తాము ఇవ్వాల్సింది ఎంతో అది మాత్రమే ఇస్తున్నామని అంటోంది. 2015 నుంచి 2019 మధ్యలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇచ్చింది గ్రాంట్ గా చూస్తే 2,500 కోట్ల రూపాయలు. వీటితో అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ ని నిర్మించుకోవాలని కేంద్రం ఇచ్చింది. ఇక ఈసారి మరో 1500 కోట్ల దాకా గ్రాంట్ గా ఇస్తున్నారని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
అంటే టోటల్ గా కేంద్రం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నాయని అర్థం అవుతోంది అని అంటున్నారు. కానీ అమరావతి రాజధాని పరిపూర్తికి లక్షల కోట్లు ఖర్చు అవుతున్న వేళ ఈ నిధులు ఏ మాత్రం అన్న చర్చ కూడా ఉంది.
ఏపీకి రాజధాని లేకుండా విడగొట్టారు. అందువల్ల కేంద్రమే మంచి రాజధాని కట్టించి ఇవ్వాలి. విభజన హామీలలో కూడా అలాగే ఉంది. ఇక బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినపుడు కానీ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వేరు అయినపుడు కానీ మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ ఘడ్ విడిపోయినపుడు కానీ కేంద్రమే కొత్త రాజధానులకు నిధులు ఇచ్చి నిర్మాణం చేసింది.
ఏపీ విషయంలో భారీగా ఎందుకు గ్రాంట్ ఇవ్వదు అన్న చర్చ ఉంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్పులు ఇస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించడం కూడా అంతా ఆలోచిస్తున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని అంటున్నారు. కానీ తెస్తున్న అప్పులు వాటికి అయ్యే వడ్డీలు తడిసి మోపెడు అవుతాయన్న ఆందోళన అయితే ఉంది.
అదే సమయంలో అమరావతిలో మిగులు భూములు ఒక నాలుగు వేల వరకూ ఉంటాయని వాటిని అమ్మి అన్ని అప్పులు తీర్చేస్తామని చెబుతున్నారు. కానీ ఈ వడ్డీలకు ఆ భూముల పెరిగిన రేట్లకు బ్యాలెన్స్ అయితే ఓకే కానీ అలా కాకుండా తేడా వస్తే మాత్రం భవిష్యత్తు తరాల మీద అమరావతి రాజధాని అప్పుల భారం పెద్ద ఎత్తున పేరుకుపోతుందని అంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలో కేంద్రం మీద ఒత్తిడి బాగా పెట్టి కనీసంగా పాతిక వేల కోట్లు అయినా అమరావతి రాజధాని కోసం కూటమి ప్రభుత్వం అడిగితే బాగుంటుంది అని అంటున్నారు. అప్పులు అంటే ఎప్పటికి అయినా తిప్పలే కాబట్టి కేంద్రం ఏపీ పరిస్థితి చూసి ఉదారంగా గ్రాంట్లు ఇస్తేనే ఏపీ బతికి బట్టకడుతుందని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీ ఎంపీల మీద ఆధారపడిన ఈ నేపథ్యంలో మోడీ ఏప్రిల్ 15న అమరావతికి వచ్చేటపుడు భారీ గ్రాంట్లు రాజధాని కోసం ఇస్తామని ప్రకటించేలా చూడాలని కోరుతున్నారు.