సాయిరెడ్డి టార్గెట్ ఎవరు.. ఎందుకు ..!
కానీ, అందరికీ లక్ష్యం.. అందరి విమర్శలు.. వేళ్లు.. ఇలా అన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.;
వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు వి. విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు? ఎందుకు ఆయనను టార్గెట్ చేశారు? అసలు రీజనేంటి? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ. ఒక్కసాయిరెడ్డి అనే కాదు.. దాదాపు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకుల అందరి టార్గెట్ కూడా.. ఒకే ఒక్కనాయకుడు. ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. వార్డు సభ్యుడుగా కూడా గెలవలేదు. కానీ, అందరికీ లక్ష్యం.. అందరి విమర్శలు.. వేళ్లు.. ఇలా అన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.
ఆయనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఆళ్ల నాని నుంచి అవంతి శ్రీనివాసరావు వరకు.. సాయిరెడ్డి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వరకు.. ఇలా అందరూ రగిలిపోతున్న ఏకైక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో ఆయన వ్యవహరించిన తీరు.. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయన తిష్ఠవేసిన వైనం.. ఆదేశాలు.. ఏకఛత్రాధిపత్యం వంటివే.. నాయకులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. గురి చేశాయి. ఏం జరగాలన్నా.. సజ్జలే కీలకంగా మారారు.
పార్టీకి ప్రత్యక్ష అధ్యక్షుడు, అధినేత జగన్ అయితే.. షాడో అధ్యక్షుడిగా సజ్జల చక్రం తిప్పారన్నది గతం లోనే విమర్శ ఉంది. జగన్‌ను కలుసుకునేందుకు వచ్చే ప్రతి నాయకుడూ.. సజ్జలను ప్రసన్నం చేసుకో వాల్సి వచ్చేది. ముందుగా ఆయన దర్శనం చేసుకుని.. అనుమతి తీసుకుంటే తప్ప. జగన్ దర్శనం అయ్యేది కాదు. ఇది రెండు రకాలుగా నాయకులను ఇబ్బందికి గురిచేసింది. తాము ప్రజాప్రతినిధులం అయితే.. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాదన్న బలమైన అభిప్రాయం ఉంది.
అదేసమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టి.. ఎంతో ఖర్చు చేసి పార్టీని నిలబెట్టామన్న అభిప్రాయం కూడా ఉంది. అలాంటి తమకు.. సజ్జల అనుమతి ఎందుకన్న ప్రశ్న గతంలోనే ఉదయించింది. అయిన ప్పటికీ.. జగన్ సజ్జలనే ఇప్పటికీ పట్టుకుని వేలాడుతున్నారు. పార్టీ ఓటమి దరిమిలా ఆత్మ విమర్శ చేసుకున్న దాఖలా కూడా లేదు. ఈ పరిణామమే.. పార్టీలోని సీనియర్లను రగిలిస్తోంది. సాయిరెడ్డి తాజాగా చేసిన కోటరీ వ్యాఖ్యలు సజ్జలను ఉద్దేశించినవేనని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. మరి.. జగన్ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.