అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ కు అవమానం... బట్టలు విప్పి..!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే.;
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నిన్నటివరకూ వలసదారులపై పలు కండిషన్స్ పెట్టిన ట్రంప్.. ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని కూడా టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ గ్రీన్ కార్డ్ హోల్డర్ కు సంబంధించి షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పలు ఆంక్షలు అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికన్ గ్రీన్ కార్డు కలిగిన ఓ వ్యక్తికి విమానాశ్రయంలో ఘోర అవమానం జరిగిన ఉదతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మార్చి 7న మసాచుసెట్స్ లోని లోగాన్ విమానాశ్రయంలో జరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్ ను మసాచుసెట్స్ లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్ షైర్ లో ఉంటున్నారు. ఈ సమయంలో.. స్మిత్ లక్సెంబర్ పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా ఇది జరిగింది.
ఇందులో భాగంగా... ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం... స్మిత్ ను ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో.. అసలు అతన్ని ఎందుకు నిర్భందించారో తమకు తెలియదని వారు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన స్మిత్ భాగస్వామి... స్మిత్ గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారని.. అతనిపై ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవని.. అతన్న్ని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్ట్ కి అతని స్నేహితులు వచ్చారని.. ఎంతసేపు చూసినా రాకపోయేసారికి అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు పట్టిందని చెబుతున్నారు!
ఇదే సమయంలో.. తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్ అయ్యిందని అధికారులు తనకు చెప్పారని.. స్మిత్ తల్లి మీడియాతో అన్నారు. వాస్తవానికి తన కుమారుడికి 2023లోనె గ్రీన్ కార్డ్ ను చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. అది చెల్లుబాటులో ఉన్నప్పటికీ స్మిత్ ను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా స్పందించిన యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ హిట్లన్ బెక్హాం... చట్టాలు లేదా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రయాణికులను నిర్బంధించడం.. లేదా, తిరిగి వెనక్కి పంపడం జరుగుతుందని తెలిపారు. గోప్యతా నిబంధనల కారణంగా నిర్దిష్ట కేసుల వివరాలను వెల్లడించమని పేర్కొన్నారు.