ఎమ్మెల్యే గేమ్స్.. వైసీపీ ఎమ్మెల్సీలు వస్తున్నారోచ్..

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.;

Update: 2025-03-17 14:39 GMT

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. మొత్తం 173 మంది క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ క్రీడాపోటీలకు వచ్చేది లేనిది ప్రతిపక్ష వైసీపీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం తాము కూడా పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోటీల్లో ఆ ఇద్దరు ఆసక్తికరంగా మారారు.

ఇక రేపటి నుంచి మూడు రోజుల పాటు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు నిర్వహించే పోటీలతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువ నేత, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణంరాజు కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. గత నెల 28 నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ముగియనున్న సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఈ పోటీల్లో పాల్గొనాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచిస్తున్నారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ గేమ్స్ కు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ విధించారు. విజేతలకు 20న సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఎక్కువ మంది రెండు మూడు రకాల ఆటలు ఆడతామని పేర్లు ఇచ్చారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయట్, క్యారమ్స్, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ కింద పరుగు పందెం, షాట్ పుట్ పోటీలను నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాడ్మింటన్ ఆడనుండగా, మంత్రి లోకేశ్ వాలీబాల్, క్రికెట్, షటిల్ ఆడేందుకు పేరిచ్చారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజ షటిల్, వాలీబాల్ ఆడేందుకు సిద్ధమవగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లు ఇచ్చారు. క్రీడా మంత్రి రామప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నిస్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలకు పేరు నమోదు చేసుకున్నారు. మొత్తంగా ఎక్కువ మంది క్రికెట్ ఆడేందుకు పేర్లు ఇచ్చారు. సుమారు 31 మంది క్రికెట్ ఆడతామని పేర్లు ఇవ్వడం విశేషం. యువ ఎమ్మెల్యేలు అంతా క్రికెట్ పైనే ఆసక్తి చూపుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, డాక్టర్ పార్థసారథి, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామక్రిష్ణ, సుందరపు విజయకుమార్ కూడా పోటీలకు రెడీ అంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, విప్ యార్లగడ్డ వెంకటరావు, యువ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు తదితరులు కూడా పలు క్రీడలకు పేర్లు ఇచ్చారు. అదేవిధంగా మహిళా మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవితమ్మ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ పోటీలకు హైలెట్ గా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు పేర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు టి.మాధవరావు, రవీంద్రనాథ్ సైతం ఆటల పోటీకి ఆసక్తి చూపడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News