వారందరికీ వైకుంఠ దర్శనం.. మూడు రోజులు శ్రీవారి కొలువు!
ఈ క్రమంలోనే తిరుపతిలో భారీ ఎత్తున భక్తులు రావడం.. తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతి చెందడం తెలిసిందే.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారంలో దర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఏటికి ఒక్కసారి వచ్చే ఈ పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి శ్రీహరిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదన్న పురాణోక్తి ప్రజల్లోకి బలంగా చేరి పోయింది. దీంతో వైకుంఠ ఏకాదశికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతిలో భారీ ఎత్తున భక్తులు రావడం.. తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతి చెందడం తెలిసిందే.
ఇదిలావుంటే.. షెడ్యూల్ ప్రకారం.. తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశినాడు దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం.. టికెట్లను ఇచ్చేసింది. మొత్తం లక్షా 20 వేల మందికి మాత్రమే ఈ సారి శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వారం నుంచి లభించనుంది. ఈ టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. దీని ప్రకారం.. రోజుకు 40 వేల మందిని అనుమతిస్తున్నారు.
వీరు మినహా.. ఇతర సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం ఈ మూడు రోజులు దుర్లభం. అయితే.. ఈ విషయంలో టీటీడీ మరో వెసులుబాటు కల్పించింది. రోజుకు 40 వేల చొప్పున 1.20 లక్షల టోకెన్లు జారీ చేసినా.. రద్దీ కనుక సాధారణంగా ఉంటే.. ఏ రోజుకు ఆరోజు.. తిరుపతిలోని పలు కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నారు.
45 నిమిషాల్లో ఖాళీ..
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1.2 లక్షల టోకెన్లను టీడీపీ పంపిణీ చేయగా.. 90 కౌంటర్లలో కేవలం 45 నిమిషాల్లో టోకెన్లు పూర్తి అయ్యాయి. మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. అయితే.. స్థానిక కోటాలో కొందరికి సాధారణ దర్శనం కల్పించే టోకెన్లను పంపిణీ చేయడం గమనార్హం. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో పోలీసులు పక్కా ఏర్పాట్లు చేశారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద క్యూలైన్లను పటిష్టంగా నిర్వహించారు. దీంతో 45 నిమిషాల్లోనే శ్రీవారి దర్శన టికెట్ లు అయిపోయాయి.