ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తన సొంత జిల్లాకు ఏం చేశారో ఏం చేయలేదో కానీ, టీడీపీకి మాత్రం ఏదో చేసేస్తానంటుంటారు నిత్యం. తాజాగా ఆయన మరో భారీ బాంబు పేల్చారు. వైసీపీ నుంచి ఒక ముఖ్య నేత కోసం తాము వేచి చూస్తున్నామని, అదే జరిగితే వైసీపీ దుకాణం ఖాళీ కావడం ఖాయమని అంటున్నారు. ఏకంగా వైసీపీ దుకాణం మూసేయించగలిగేంత స్థాయి ఉన్న నేత వైసీపీలో ఎవరున్నారో మాత్రం ఆయన చెప్పలేదు.
దీంతో వైసీపీ అభిమానులు - ఆ పార్టీ నేతల నుంచి దీనిపై సెటైర్లు పడుతున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పినంత స్థాయి గల వైసీపీ నేత అంటే జగనే కనిపిస్తున్నారని.. ఒకవేళ అచ్చెన్నాయుడేమైనా జగన్ ను టీడీపీలో చేర్పిస్తారా ఏంటి? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తాము అనుకుంటున్న నేత వైసీపీ నుంచి వచ్చేస్తే ఆ పార్టీలో జగన్ తల్లి - చెల్లి - కొద్దిమంది బంధువులే ఉంటారని అచ్చెన్నాయుడు అంటున్నారు. దీంతో వైసీపీ అభిమానులు అచ్చెన్నాయుడి మాటల పట్ల నవ్వుతున్నారు.
అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఈ కామెంట్ చేశారు. తాము అనుకున్నది జరిగితే జగన్ పాదయాత్ర ముగిసే నాటికి వైసీపీలో ఆయన తల్లి - చెల్లి - కొద్ది మంది బంధువులు మాత్రమే ఉంటారని అన్నారు. టీడీపీలోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరితే రాజ్యసభలో అభ్యర్థిని నిలపడానికి కూడా వైసీపీకి బలం చాలదని అచ్చెన్న అన్నారు. అదంతా బాగానే ఉన్నా ఆయన చెబుతున్నట్లు వైసీపీ దుకాణం బంద్ చేయగయలిగేటంతటి లీడర్ ఎవరా అన్నదే చర్చగా మారిపోయింది.