9 మంది పిల్లలకు తల్లి.. మరోసారి ప్రెగ్నెంట్.. ఆమె రూటే సపరేటు
ఒకరు చాలు అన్న రోజులు పోయాయి. ఇప్పుడు పాలకులు సైతం వీలైనంత ఎక్కువ మందిని కనండి.. సంతానాన్ని పెంచండంటూ తరచూ ప్రకటనలు చేస్తున్నారు
ఒకరు చాలు అన్న రోజులు పోయాయి. ఇప్పుడు పాలకులు సైతం వీలైనంత ఎక్కువ మందిని కనండి.. సంతానాన్ని పెంచండంటూ తరచూ ప్రకటనలు చేస్తున్నారు. జనాభా సమతుల్యత విషయంలో ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే ఈ జంట గుర్తించినట్లుంది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా ఇప్పటివరకు తొమ్మిది మంది పిల్లలకు తల్లైన ఒక మహిళ.. తాజాగా మరోసారి ప్రెగ్నెంట్ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులోని నామక్కల్ జిల్లాకు చెందిన ఈ మహిళ పేరు సంగీత. మల్లసముద్రం పట్టణ పంచాయితీ పెరియకొల్లపట్టికి చెందిన 40 ఏళ్ల గోపీ.. 35 ఏళ్ల సంగీతకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె తొమ్మిది మందిని ఇంట్లోనే ప్రసవించింది. అందులో ఒకరు మరణించగా.. మరొకరిని దత్తత ఇచ్చారు. ఇప్పుడు వారితో పాటు ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె మరోసారి గర్భవతైంది.
ఈ విషయం తెలిసిన బంధువులు.. ఆమె ఆరోగ్యం దెబ్బ తింటుందని.. ఈసారి అబార్షన్ చేయించుకోవాలని సూచన చేశారు. అదేపనిగా నచ్చచెప్పి.. రెండునెలల గర్భంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ తాను అబార్షన్ చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో మల్ల సముద్రం ప్రాంతీయ వైద్యాధికారి ప్రశాంత్ విసయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెకు నచ్చ చెప్పి అబార్షన్ చేయించటానికి 108 అంబులెన్స్ లో నామక్కల్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమె అబార్షన్ చేయించుకోవటానికి ససేమిరా అన్నారు. దీంతో.. చేసేదేమీ లేక.. ఆమెను ఇంటికి పంపించేవారు. ఇప్పుడున్న కాలంలో తొమ్మిది మంది పిల్లల్ని కని.. మరో సంతానానికి జన్మనిచ్చేందుకు తపిస్తున్న మహిళ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.