వీడియో: ఈ కారు పేరు జీరో... గాల్లో ఎగరడంలో ఇది హీరో!
ఇప్పటివరకూ ఉన్న ఫ్లయింగ్ ట్యాక్సీ వంటి కార్లు రోడ్డును రన్ వేలుగా ఉపయోగిస్తాయని.. కానీ, తాము అభివృద్ధి చేస్తున్న కారు (మోడల్ జీరో) రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని చెబుతున్నారు.
ప్రపంచంలో ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ఫ్లయింగ్ కార్లు ఉన్నప్పటికీ... తాము రూపొందిస్తున్న కారు భిన్నమైందని చెబుతోంది అలెఫ్ ఏరోనాటిక్స్. ఇప్పటివరకూ ఉన్న ఫ్లయింగ్ ట్యాక్సీ వంటి కార్లు రోడ్డును రన్ వేలుగా ఉపయోగిస్తాయని.. కానీ, తాము అభివృద్ధి చేస్తున్న కారు (మోడల్ జీరో) రోడ్డుపై నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోగలదని చెబుతున్నారు.
అవును... పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు తోడు, టైం సేవింగ్స్ లో భాగంగా గత కొంతకాలంగా ఫ్లైయింగ్ టాక్సీలకు సంబంధించిన కథనాలు ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఆసక్తికరమైన ఫ్లయింగ్ కార్ అప్ డేట్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది.
తాజాగా ఈ కారును ప్రయోగాత్మకంగా కాలిఫోర్నియాలోని ఓ రోడ్డుపై సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఈ కారు రోడ్డుపై కాస్త దూరం ప్రయాణించి ఆపై నిట్టనిలువుగా టెకాఫ్ అయ్యింది. అనంతరం ముందున్న కారుపై నుంచి ఎగురుతూ ముందుకు సాగింది. మళ్లీ రోడ్డుపై దిగి ముందుకు కదిలింది.
ఈ సందర్భంగా... సాధారణ కార్లలో బానెట్ లో ఇంజిన్ ఉంటే.. ఈ మోడల్ జీరో కారులో మాత్రం నాలుగు చిన్న ఇంజిన్లు వాటి వాటి చక్రాల వద్ద అమర్చినట్లు కంపెనీ తెలిపింది. వాటి సాయంతో సాధారణ ఎలక్ట్రిక్ కారులాగానే ఈ కారు రోడ్డుపై దూసుకెళ్తోంది. ఇక.. ఖాళీగా ఉన్న బానెట్, డిక్కీలలో ఎనిమిది ప్రొపెల్లర్లను ఏర్పాటు చేసింది.
ఈ ఎనిమిది ప్రొఫెల్లర్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి వేటికవే వేరువేరు వేగాలతో పరిభ్రమించగలవు.. అందువల్ల కారు ఏ దిశలో అయినా ఎగరడం సాధ్యం అవుతోంది. పైగా... ఈ కారు ఫ్రేమ్ కోసం కార్బన్ ఫైబర్ వాడటంతో దీని బరువు 385 కిలోలకే పరిమితమైంది. ఇది సులువుగా ఎగరడానికి మరింత సాధ్యమవుతుందని చెబుతున్నారు.
ఇక... ప్రస్తుత మోడల్ జీరో నమూనా కారు గాల్లో సుమారు 177 కి.మీ. దూరం ప్రయాణించగా, రోడ్డుపై మాత్రం 56 కిలోమీటర్ల దూరం వెల్లగలదని అలెఫ్ ఏరోనాటిక్స్ వివరించింది. సాధారణ ప్రజలు ఈ కారును వాడటం ఎంతో సులభమని.. కేవలం పదిహేను నిమిషాల్లోనే కారులోని కంట్రోల్స్ పై పట్టు సాధించొచ్చని సీఈవో జిం డకోవ్నీ పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. ధర విషయానికొస్తే... ఈ కంపెనీ ఇప్పటికే ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. ఈ సమయంలో కారు ధరను సుమారు రూ.2.57 కోట్లుగా ఖరారు చేసింది. అయితే.. ఫ్యూచర్ లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టి.. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా సుమారు రూ.27.35 లక్షలకు కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.