8 మంది కోసం 322 మంది... టన్నెల్లో తాజా పరిస్థితి ఇదే!
టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్.ఎల్.బీ.సీ) సొరంగ మార్గంలో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఇందులో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లతో పాటు మరో నలుగురు కార్మికులు లోపల చిక్కుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... 8 మంది బాధితులను క్షేమంగా రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని.. సొరంగం పైనుంచి లోనికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో వీరి కోసం ఎన్.డీ.ఆర్.ఎఫ్., ఎస్.డీ.ఆర్.ఎఫ్., ఆర్మీతో పాటు సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు!
అవును... నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వారి కోసం 130 మంది ఎన్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది., 120 మంది ఎస్.డీ.ఆర్.ఎఫ్., 24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24 మంది ఆర్మీ, 24 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సొరంగంలోని 13.5 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది.. ఈ సమయంలో అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు.. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. అక్కడ నుంచి అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో 14వ కి.మీ.వద్ద 100 మీటర్ల మేర భారీగా బురద పేరుకుపోయిందని.. ఈ సమయంలో, ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నామని.. మరో 100 మీటర్లు బురద దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతుండగా.. 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదని ఎన్.డీ.ఆర్.ఎఫ్. డిప్యూటీ కమాండెంట్ తెలిపారు.
ఇదే సమయంలో... బాధితులను క్షేమంగా రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రులు, అధికారులు చెబుతూ బాధితుల కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు.